Vizag: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం.. 40కిపైగా బోట్లు దగ్ధం.. భారీగా ఆస్తి నష్టం
Vizag: బోట్లలో పేలిన డీజిల్ ఆయిల్ సిలిండర్లు
Vizag: విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం.. 40కిపైగా బోట్లు దగ్ధం.. భారీగా ఆస్తి నష్టం
Vizag: విశాఖలోని ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఓ బోటులో మంటలు చెలరేగడం ఈ ప్రమాదానికి కారణమైంది. బోట్లలో నిద్రపోతున్న వారు మంటల్లో చిక్కుకున్నారేమోనని తొలుత అనుమానాలు వ్యక్తమయ్యాయి. అయితే ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని తేలింది. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది.. హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అర్ధరాత్రి సమయంలో కొన్ని బోట్లు వేట ముగించుకొని తీరానికి రాగా.. మరికొన్ని బోట్లు అప్పుడే డీజిల్ నింపుకొని వేటకు సిద్ధమయ్యాయి. ఆ సమయంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. బోటుల్లో అప్పుడే డీజిల్ నింపడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. దీంతో పాటు చాలావరకు పోర్టులో ఫైబర్ బోట్లు ఉండటంతో మంటలు వేగంగా వ్యాప్తి చెందాయి. దాంతో బోట్లన్నీ ఒకదాని తర్వాత ఒకటి మంటల్లో కాలిపోయాయి. మంటలు దాదాపు 60 బోట్లకు వ్యాపించగా... 40 నుంచి 50 బోట్లు దగ్ధమయ్యాయి. వేట నుంచి తీసుకొచ్చిన మత్స్యసంపద కూడా బూడిదపాలైంది.
ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే ఘటనా స్థలానికి పది ఫైరింజన్లు చేరుకున్నాయి. అగ్నిమాపక దళాలతో పాటు.. విశాఖపట్నం పోర్టు అథారిటీ నుంచి ప్రత్యేకమైన అగ్నిమాపక నౌకను రప్పించారు. నాలుగు గంటల పాటు తీవ్రంగా శ్రమించి మంటల్ని అదుపులోకి తీసుకురాగలిగారు. ఈ ప్రమాదంలో దాదాపు 30 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని అంచనా వేస్తున్నారు. అయితే ఇది ఆకతాయిల పనే అంటున్నారు స్థానికులు.