డ్యాన్స్ చేస్తూ తూలి పడిపోయాడేమో అనుకున్నారు.. కానీ లేవకపోవడంతో..
పాలకొండ మండలం బాసూరు గ్రామంలో పెళ్లి సందడిలో విషాదం నెలకొంది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన గ్రామంలో అందర్నీ విషాదంలో ముంచింది.
డ్యాన్స్ చేస్తూ తూలి పడిపోయాడేమో అనుకున్నారు.. కానీ లేవకపోవడంతో..
Manyam District: పాలకొండ మండలం బాసూరు గ్రామంలో పెళ్లి సందడిలో విషాదం నెలకొంది. గురువారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన గ్రామంలో అందర్నీ విషాదంలో ముంచింది. పెళ్లి ఊరేగింపులో స్నేహితులతో కలిసి డ్యాన్స్ చేస్తుండగా సుంకరి బంగారు నాయుడు (38) అనే వ్యక్తి అకస్మాత్తుగా హార్ట్ స్ట్రోక్‌తో కుప్పకూలిపోయాడు.
గ్రామ యువజన సంఘం అధ్యక్షుడిగా, విద్యా కమిటీ చైర్మన్‌గా ఉన్న బంగారు నాయుడు పెయింటింగ్ మేస్త్రిగా జీవనం సాగిస్తూ గ్రామంలో ఎవరి ఫంక్షన్ జరిగినా ముందుండేవాడు. పక్కింటి బంధువు కుమారుడి పెళ్లికి గురువారం తెల్లవారు జామున దగ్గరుండి DJ సౌండ్‌ల మధ్య ఊరేగింపును ఎంతో ఉత్సాహంగా నిర్వహించాడు.
ఊరేగింపు ముగింపు దశలో స్నేహితులతో కలిసి స్టెప్పులేసిన బంగారు నాయుడు, అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. మొదట తూలి పడిపోయాడని భావించిన స్నేహితులు, దగ్గరికి వెళ్లి చూసినపుడు అతనిలో ప్రాణాలు లేవని గమనించి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
DJ శబ్దం, రాత్రంతా నిద్రలేమి, శారీరక అలసట కారణంగా బంగారు నాయుడు హార్ట్ స్ట్రోక్‌కు గురైందని గ్రామస్థులు చెబుతున్నారు. ఒక మంచి వ్యక్తి, ప్రతి ఫంక్షన్‌కు ముందుండే గ్రామ సేవకుడిని కోల్పోవడంతో బాసూరు గ్రామమంతా విషాదంలో మునిగిపోయింది.