ఏపీలో ఆరువారాల పాటు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా
కరోనా వైరస్ ప్రభావంతో ఏపీలో ఆరువారాల పాటు ఎన్నికలు వాయిదా పడ్డాయి.
కరోనా వైరస్ ప్రభావంతో ఏపీలో ఆరువారాల పాటు ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారి రమేష్ కుమార్ వెల్లడించారు. ఆరు వారాల అనంతరం సమీక్ష నిర్వహించి ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటామని రమేష్ కుమార్ తెలియజేశారు. అయితే ఇప్పటికే ఏకగ్రీవమైన స్థానాలు అలాగే ఉంటాయని.. అక్కడ ఎన్నికలు నిర్వహించమని స్పష్టం చేశారు. అత్యున్నత స్థాయి సమావేశం జరిపిన తరువాతనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన తెలిపారు.
ఎన్నికల సంఘానికి ఉన్న విస్తృత అధికారాల ద్వారా ఎన్నికల ప్రక్రియ తాత్కాలికంగా నిలిపివేసినట్టు చెప్పారు. కాగా స్థానిక సంస్థల ఎన్నికలు కేవలం వాయిదా మాత్రమే పడ్డాయని రద్దు కాలేదని చెప్పారు. కరోనా వైరస్ ను జాతీయ విపత్తుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఇప్పటికే ఏపీలో అన్ని స్కూల్స్, కళాశాలలు, మాల్స్ కూడా మూతపడ్డాయని గుర్తుచేశారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజలు గుమిగూడి అవకావం ఉందని.. దానివలన కరోనా వైరస్ ప్రబలే అవకాశం ఉందని.. ఇటువంటి పరిస్థితిల్లో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని రమేష్ కుమార్ వెల్లడించారు.