AP Liquor Prices: ఏపీలో త్వరలో పెరగనున్న మద్యం ధరలు

Update: 2025-02-07 05:30 GMT

TG Liquor Prices Hike

 AP Liquor Prices: ఏపీలో మందు బాబులకు బ్యాడ్ న్యూస్. మద్యం ధరలు మళ్లీ పెరగనున్నాయి. మద్యం దుకాణదారులకు చెల్లిస్తున్న మార్జిన్ చాలడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కమిషన్ పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇప్పటికే ప్రైవేట్ మద్యం దుకాణాల ఏర్పాటుతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గింది. 2023-24లో దాదాపు రూ. 36వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయంగా లభించింది. దీనిలో డిస్టిలరీలకు చెల్లించిన డబ్బుతోపాటు ఉద్యోగుల జీతాలకు పోగా రూ. 28-30వేల కోట్ల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది.

ఏపీలో గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రైవేట్ మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపై ఆర్థిక శాఖ అభ్యంతరాలు తెలిపింది. ఏపీలో ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని ఇచ్చే మద్యం విక్రయాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తే ప్రభుత్వ ఆదాయం తగ్గుతుందని సూచించినా ప్రభుత్వం కొత్త పాలసీలో ప్రైవేట్ మద్యం దుకాణాల ఏర్పాటుకు మొగ్గు చూపింది. గతేడాది అక్టోబర్ 16 నుంచి ఏపీలో 3వేలకు పైగా ప్రైవేట్ మద్యం దుకాణాలు ఏర్పాటు అయ్యాయి.

మద్యం దుకాణాల్లో విక్రయాలకు 20శాతం కమిషన్ లభిస్తుందని ప్రచారం చేయడంతో పోటీ పడి దరఖాస్తులు చేసుకున్నారు. ఏపీలో మద్యం వ్యాపాలన్నీ ఆయా నియోజకవర్గాల్లో స్థానిక ప్రజాప్రతినిధుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయన్న విమర్శలు కూడా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వేళ్ల మీద లెక్కించదగ్గ సంఖ్యలోనే ఎమ్మెల్యేలు మద్యం వ్యాపారాలకు దూరంగా ఉన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే లిక్కర్ వ్యాపారంలో పెట్టుబడులకు తగిన విధంగా లాభాలు రావడం లేదని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత డిసెంబర్ లో కమిషన్ పెంచకపోతే అమ్మకాలు నిలిపివేస్తామని అల్టిమేటం కూడా ఇచ్చారు.

ఈ క్రమంలో వ్యాపారుల ఆందోళనలతో ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాలపై చెల్లిస్తున్న మార్జిన్ ను పెంచేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. గురువారం జరిగిన కేబినెట్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నా ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించలేనదని సమాచారం. ఏపీలో మద్యం ధరలు తగ్గుతాయంటూ కొద్ది నెలలుగా వార్తలు వస్తున్నాయి. అయితే బ్రాందీలో ఒక బ్రాండ్ , విస్కీలో మరో బ్రాండ్ రూ. 30ల వరకు ధరలు తగ్గాయి. లిక్కర్ వ్యాపారంలో గత ఐదేళ్లలో ఒడిదుడుకులు ఎదుర్కొన్న మరో బ్రాండ్ కూడా ధరను తగ్గించింది. ఈ క్రమంలో దాదాపు 10 బ్రాండ్ల ధరలు తగ్గుతాయని డిసెంబర్ నుంచి ఎక్సైజ్ శాఖ లీకులు ఇచ్చేసింది. మద్యం ధరల ఖరారు విషయంలో రకరకాల పిల్లిమొగ్గలు వేసినా ధరలు మాత్రం తగ్గలేదు. ఎక్సైజ్ శాఖ నిర్వాకంతోనే ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లు సమాచారం.

Tags:    

Similar News