ఆ జిల్లాలో టీడీపీ దాదాపు ఖాళీ!

Update: 2020-03-11 04:06 GMT

వైఎస్ఆర్ కడప జిల్లాలో ప్రతిపక్ష టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. సార్వత్రిక ఎన్నికల్లో అన్ని స్థానాలను కైవసం చేసుకున్న వైసీపీ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీని మట్టికరిపించాలని డిసైడ్ అయింది. దీంతో ఆ పార్టీకి చెందిన కీలకనేతలు ఒక్కొక్కరిని పార్టీని వీడేలా ఫిరాయింపులు ప్రోత్సాహిస్తోంది. నియోజకవర్గాల్లో అంతో ఇంతో బలం ఉన్న లీడర్లు టీడీపీని వీడుతున్నారు. నిన్న పులివెందుల ఇంచార్జ్ సింగిరెడ్డి వెంకట సతీష్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తే.. నేడు జమ్మలమడుగు ఇంచార్జ్ పొన్నపరెడ్డి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలో క్యాంపు ఆఫీసుకి చేరుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు రామసుబ్బారెడ్డి. ఇందుకోసం ఆయన నిన్న రాత్రే జమ్మలమడుగు నుంచి విజయవాడ చేరుకున్నారు.

అయితే ఆయన చేరికపై ఎమ్మెల్సీ శివనాధ్ రెడ్డి వర్గం అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే.. కానీ ఆయన అసంతృప్తిని కూడా వైసీపీ లెక్కచేయడం లేదు.. మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి తోపాటు మూడు సార్లు రాయచోటి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన సుగవాసి పాలకొండరాయుడు వర్గం కూడా టీడీపీ వీడుతున్నట్టు తెలుస్తోంది. ఆయన కుమారుడు సుగవాసి ప్రసాద్‌బాబు కూడా నేడు వైసీపీలో చేరతారని జిల్లాలో జోరుగా ప్రచారం సాగుతోంది. బద్వేలులో మరో కీలక నేత మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సైతం స్థానిక సంస్థల ఎన్నికలపై అంటిముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన ఎంపీ సీఎం రమేష్‌, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టీడీపీకి రాజినామా చేయడంతో ఆ పార్టీ కుదేలైంది.

ఈ క్రమంలో ఎలాగోలా ఇంచార్జిలను పెట్టారు.. కానీ స్థానిక సంస్థల ఎన్నికల పుణ్యమాని బలమైన ఇంచార్జిలు ఆ పార్టీని వీడుతున్నారు. దాంతో టీడీపీ ఈ జిల్లాను కనీసం పట్టించుకోవడం కూడా మానేసిందంటున్నారు విశ్లేషకులు.. ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీకి చెందిన వారు మంగళవారం నాటికి 30 శాతం మంది కూడా నామినేషన్లు దాఖలు చేయలేదు.. ఇక జిల్లాలో టీడీపీకే చెప్పుకోదగ్గ లీడర్లుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి, ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాధ్ రెడ్డి (బీటెక్ రవి), పుట్టా సుధాకర్ యాదవ్ మాత్రం అభ్యర్థులను నిలిపేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. అయినా కొన్ని మండలాల్లో చేతులెత్తేశారు. కాగా సీఎం రమేష్ , ఆదినారాయణరెడ్డి లు బీజేపీలో చేరినా స్థానిక సంస్థలను వారు సీరియస్ గా తీసుకోలేదు. ఇక నామినేషన్లకు ఈరోజే ఆఖరు కావడంతో హడావుడిగా కొందరు అభ్యర్థులు నామినేషన్ల ఘట్టానికి రెడీ అయ్యారు. మరి ఎంతమంది నామినేషన్లు వేస్తారో చూడాలి. 

Tags:    

Similar News