కృష్ణమ్మ ఉగ్రరూపం.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో హైఅలర్ట్‌

Update: 2019-08-17 03:44 GMT

కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణానది ఉప్పొంగింది. ప్రకాశం బ్యారేజీలోకి వస్తున్న వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 7 గంటలకు బ్యారేజీలోకి 7.76 లక్షల క్యూసెక్కుల (67.05 టీఎంసీల) ప్రవాహం రావడంతో అంతే స్థాయిలో వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. రాత్రికి బ్యారేజీలోకి 8 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉండటంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. వరద ఉధృతితో ఇప్పటికే కృష్ణానది కరకట్ట ముంపునకు గురైంది. ప్రకాశం బ్యారేజీ దిగువ 7వేల ఎకరాలకు పైగా పంటలు నీటమునిగాయి. అలాగే విజయవాడ నగరంలోని కృష్ణలంక, రామలింగేశ్వరనగర్‌ కట్ట దిగువున ఉన్న నివాస ప్రాంతాల్లోకి నీరు చేరింది. పెనమలూరు మండలంలోని యనమలకుదురు, పెదపులిపాక, చోడవరం గ్రామల్లో నదికి ఆనుకుని ఉన్న ఇళ్లు, పొలాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో తాడేపల్లి, మంగళగిరి నియోజకవర్గాల్లో ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు 8 పునరావాస కేంద్రాల ద్వారా 1,619 మందికి ఆశ్రయం కల్పించారు. 537 నివాసాలు ముంపు బారిన పడ్డాయి. వరదను ఎప్పటికప్పుడు విశ్లేషించడానికి డ్రోన్‌లను వినియోగిస్తున్నారు. 

Tags:    

Similar News