నిందితులతో జనసేనకు సంబంధం లేదు.. తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు

Update: 2020-08-29 12:25 GMT
janasena: విశాఖలోని పెందుర్తిలో బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు నివాసంలో శ్రీకాంత్ అనే దళిత యువకుడికి శిరోముండనం జరిగిన సంగతి తెలిసిందే. దీనిపై జనసేన పార్టీ స్పందించింది. శిరోముండనం కేసులో ప్రధాన నిందితుడు జనసేన పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అని, ఆయన జనసేన పార్టీలో ఉన్నారని జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు ఓ ప్రకటన చేసింది.


జనసేన ప్రకటన యధావిధిగా..
నిందితులతో జనసేనకు సంబంధం లేదు..తప్పుడు ప్రచారం చేస్తే చర్యలు తప్పవు

విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో శిరోముండనం కేసులో ప్రధాన నిందితుడు జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు అభిమాని అని, జనసేన పార్టీలో వున్నారని చేస్తున్న అసత్య, అసందర్భపు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన సంఘటనలో శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు పేరును తీసుకురావడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. నిందితులు జనసేన పార్టీలో కనీసం సభ్యులు కూడా కారు. శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు- అన్యాయానికి కొమ్ము కాసే నేత కాదని ప్రతి ఒక్కరికీ తెలుసు. అన్యాయం ఎక్కడ జరిగినా జనసేన వ్యతిరేకిస్తుంది. బాధితులకు బాసటగా నిలుస్తుంది. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్‌ లో దళితులపై జరిగిన అకృత్యాలపై శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు బలంగా స్పందించిన విషయాన్ని ప్రజలు మరచిపోలేదన్న సంగతిని 'దుష్ప్రదారకులు గుర్తుంచుకోవాలి. శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు లక్షలాది మంది అభిమానులు ఉన్నసుప్రసిద్ధ హీరో. నిందితుడు ఆయన అభిమాని అయినంత మాత్రాన ఇటువంటి దురదృష్టకర సంఘటనలో ఆయన పేరు తీసుకు రావడం గర్హనీయం. ఈ కేసులో తగిన విచారణ జరిపి దోషులను చట్టపరంగా శిక్షించాలని జనసేన కోరుతోంది. ప్రమేయంలేని విషయాలలో పార్టీనిగాని లేదా పార్టీ అధ్యక్షులు, నాయకుల పేర్లను ప్రస్తావించిన పక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నాము. అని ప్రకటనలో తెలిపారు.



 





Tags:    

Similar News