Heavy rains: గిరిజన గ్రామాలను వణికిస్తున్న వర్షాలు

Update: 2020-08-17 10:28 GMT

Heavy rains: ఉగ్రరూపం దాల్చిన వరద గోదావరి పశ్చిమగోదావరి జిల్లాలో గిరిజన గ్రామాలను వణికిస్తోంది. పోలవరం ,బుట్టాయిగూడెం, కుక్కునూరు మండలాల్లో కాజ్ వేలుపై వరద ఉప్పొంగుతోంది. కాజ్ వే దాటాలంటే నరకం చూస్తున్నారు గిరిపుత్రులు. తేడా వస్తే గోదారికి బలవ్వాల్సిందే. అంతలా ప్రాణాలకు తెగించి పంటెలపై ప్రయాణం చేయాల్సి వస్తోంది. గోదావరి ఉప్పొంగినప్పుడల్లా గిరిజనుల జీవితాలు ఇంతే అప్పటి వరకూ అలా నడిచి వెళ్లిన కాజ్ వేలు పట్నం నుంచి తిరిగి వచ్చేసరికి దాటంటే గుండె జారిపోవాల్సిందే అంతలా వరదనీరు కాజ్ వేలను ముంచెత్తింది. వరద తీవ్రతకు రహదారుల తెగిపోతున్నాయి. రవాణా మార్గాలు మూసుకుపోతున్నాయి. కొండవాగులు పొంగడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.

గోదారమ్మ ఉప్పొంగుతోంది కాజ్ వేలు కనిపించనంతగా రోడ్లు కొట్టుకుపోయేంతలా వరద పరవళ్లు తొక్కుతోంది. పోలవరంలోని ఏజెన్సీ గ్రామాలపైకి ఎగబాకుతోంది. జిల్లాలోని కుండపోత వానలకు తోడు ఎగువ రాష్ట్రాల నుంచి వస్తున్న వేలాది క్యూసిక్‌ల వరద నీటితో పోలవరం వద్ద గోదావరి నిండు కుండలా మారింది. ఇప్పటికే పోలవరం కాపర్ డ్యామ్ వద్ద 27మీటర్లకు వరద నీరు చేరడంతో పోలవరం ఏజెన్సీ గ్రామాలు వణికిపోతున్నాయి. గోదావరిలో వరదనీటికి తోడు ఎగువ నుంచి వస్తున్న కొండవాగుల ప్రవాహ తీవ్రతతో కొత్తూరు కాజ్ వే పై 10 అడుగులకుపైగా వరదనీరు ప్రవహిస్తోంది.

భద్రాచలం వద్ద గోదావరి వరద తీవ్రత పెరగడంతో పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు ఏజెన్సీ మండలాల్లో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గుండేటి వాగు ఉప్పోంగుతోంది. దీనికి తోడు గోదావరి ఎగపోటుతో కుక్కునూరు, దాచారం గ్రామాల మధ్య కాజ్ వే నీటమునిగింది. దీంత కుక్కునూను మీదుగా కాజ్ వే దాటుకును వెళ్లే అనేక గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలం ఎద్దువాగు వంతెన వరద నీటితో మునిగిపోవడంతో 15 గిరిజన గ్రామాల్లోని ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పశ్చిమగోదావరి జిల్లాలో ఓవైపు గోదావరి గిరిజనగ్రామాలను వణికిస్తుంటే మరో వైపు దిగువున ఉన్న నరసాపురం తీర ప్రాంత ప్రజలు గోదావరి ఉదృతికి ఆందోళన చెందుతున్నారు. కొండవాగులు బుట్టాయిగూడెం మండలంలో ప్రజారవాణా వ్యవస్దపై తీవ్ర ప్రభావం చూపింది. జిల్లాలో వరద ప్రభావంపై ఉన్నతాధికారులు దృష్టిసారించి ఏజెన్సీ గ్రామాల్లోని రెవెన్యూ అధికారులను అప్రమత్తం చేయడంతోపాటు కాజ్ వేల వద్ద పోలీసు భద్రత ఏర్పాటు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు.


Tags:    

Similar News