logo
తెలంగాణ

ఉగ్రరూపం దాల్చిన గోదావరి..భయం గుప్పిట్లో ఏజెన్సీ ప్రాంతాలు

ఉగ్రరూపం దాల్చిన గోదావరి..భయం గుప్పిట్లో ఏజెన్సీ ప్రాంతాలు
X
ఉగ్రరూపం దాల్చిన గోదావరి
Highlights

Godavari River Flood : గత వారం రోజులుగా తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది.

Godavari River Flood : గత వారం రోజులుగా తెలంగాణతో పాటు ఎగువ రాష్ట్రాల్లో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో అధికారులు ఆరేళ్ల తర్వాత భద్రాచలంలో మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇటు గోదావరితో పాటు రాష్ట్రంలోని చెరువులు, కుంటలు, వాగులు, ఇతర నదులు కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. రిజర్వాయర్లు కూడా నిండు కుండల్లా కళకళలాడుతున్నాయి. ఇక పోతే ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంటకు భద్రాచలం వద్ద నీటి మట్టం 52 అడుగులు దాటింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 54.90 అడుగుల స్థాయిలో వరద ప్రవాహం చేరుకుంది. ఇక సోమవారం ఉదయం 7 గంటలకు వరద ప్రవాహం 58.60 అడుగులకు చేరింది. దీంతో అధికారులు నిన్న సాయంత్రమే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 17.23 లక్షల క్యూసెక్కుల వరద ప్రవహిస్తోంది.

భద్రాచలంలో పెరుగుతున్న గోదావరి ఉద్ధృతుని దృష్టిలో పెట్టుకున్న కేంద్ర జలసంఘం ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. కాగా ప్రమాదకర స్థాయి ఈరోజు రాత్రి 9 గంటలకు దాటవచ్చని తెలిపింది. కానీ అధికారులు ఊహించని రీతిలో అంతకుముందే గోదావరి ప్రమాదకర స్థాయి దాటింది. ఊహించని వేగంతో వరద ప్రవాహం పెరుగుతుండటంతో.. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల్లోని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో సహాయక చర్యల కోసం అధికారులు రాష్ట్రస్థాయి కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. గోదావరి పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు. వరద బాధితులు సహాయం కోసం 040-423450624 నంబర్‌కు ఫోన్‌ చేయాలని పరిసర ప్రాంతాల ప్రజలకు అధికారులు సూచించారు.

ఇప్పటికే పెరుగుతున్న వర్షాలకు మణుగూరు నుంచి నెల్లిపాక, రామచంద్రాపురం గ్రామాల మీదుగా భద్రాచలం వెళ్లే మార్గాన్ని గోదావరి ముంచెత్తింది. కిన్నెరసానిపై పినపాక పట్టీనగర్ వద్ద ఉన్న బ్రిడ్జి సమీపంలో బుంగ ఏర్పడింది. బూర్గంపహాడ్‌ కూడా ముంపునకు గురైంది. పాల్వంచ-భద్రాచలం, మణుగూరు మధ్య తిరిగే వాహనాలను ఉప్పుసాక, పాండురంగాపురం మీదుగా మళ్లిస్తున్నారు. కిన్నెరసాని గేట్లెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తుండటంతో.. భారీ ఎత్తున నీరు గోదావరిలోకి చేరుతోంది.

ఇక పోతే తెలంగాణలో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది భారత వాతావరణ విభాగం (IMD) తెలిపింది. ఎడతెరపిలేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో నీరంతా రోడ్లపైకి రావడంతో రోడ్లు తెగిపోయి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు కుప్పకూలుతాయి. నదులు ప్రమాదకర స్థాయిలో ఉప్పొంగుతాయి.

ఆదిలాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, కుమ్రం భీమ్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, హైదరాబాద్ జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హెచ్చరించంది. ఈ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరికులు జారీ చేసింది.
Web Titlegodavari river flood water level at bhadrachalam nears 60 feet mark 3rd warning issued
Next Story