నిబంధనలకు విరుద్ధంగా నిర్మితమవుతున్న భవనాలపై అధికారుల ఉదాసీనత

పట్టణంలో నిబంధనలకు విరుధ్ధంగా జరుగుతున్న భవన నిర్మాణాల పట్ల పంచాయితీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు.

Update: 2020-02-06 11:26 GMT

పాయకరావుపేట: పట్టణంలో నిబంధనలకు విరుధ్ధంగా జరుగుతున్న భవన నిర్మాణాల పట్ల పంచాయితీ అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. దీంతో నిర్మాణదారులు అడ్డూ అదుపూ లేకుండా బహుళ అంతస్థుల భవనాలను తమకు నచ్చిన రీతిలో నిర్మించేసుకుంటున్నారు. జీ ప్లస్ టూ వరకూ పంచాయితీ అనుమతి ఇవ్వవచ్చు. అంతకు మించి నిర్మించే ఫ్లోర్ లకు విఎంఆర్డిఏ (ఉడా) అనుమతులు తప్పనిసరి. అయితే అటువంటి వాటిపై పంచాయితీ పరిశీలన చేయవలసి ఉన్నది. కానీ ఇక్కడి అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్ళడం జరిగింది. దానిపై విచారణ చేసిన అధికారులు ఈవో శ్రీనివాసరావుకి మెమో జారీ చేయడం జరిగిందని పత్రికల్లో వార్తలు వచ్చాయి. బహుళ అంతస్థులు నిర్మాణాలకు నిబంధనల మేరకు రోడ్లు గానీ, భవనానికి సెట్ బ్యాక్ స్థలం వదలడం గానీ లేకుండానే నిర్మాణాలు జరిగిపోతున్నాయి. వాటిపై స్థానికులు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమ నిర్మాణాలపై ఈవో శ్రీనివాసరావుని వివరణ అడుగగా..

తాను ఇక్కడ బాద్యతలు చేపట్టి కేవలం 6 నెలలు మాత్రమే అయ్యిందని, అవన్నీ గత ఈవో పనిచేసిన సమయంలో అనుమతులు మంజూరయ్యాయని, ఉడా వారు కూడా సహకరిస్తే చర్యలు తీసుకోగలనని, వారు సహకరించడంలేదని, నేను చిన్న ఉద్యోగిని మాత్రమే కాబట్టి ఏమీ చేయగలనని పలు రకాలుగా పొంతనలేని విధంగా తెలుపుతున్నారు. అయితే నిబంధనలకు విరుధ్ధంగా నిర్మిస్తున్న 122 భవనాలను ఇప్పటికే గుర్తించామని ఈవో అన్నారు. గుర్తించిన వాటికి నోటీసులు పంపాలంటే సంబంధిత యజమానులు అందుబాటులో ఉండడం లేదంటూ తన బాద్యతా రాహిత్యాన్ని వ్యక్తపరుస్తున్నారు.


Tags:    

Similar News