Tirumala: తిరుమలలో దారుణం.. అలిపిరి నడకమార్గంలో చిన్నారిని చంపేసిన చిరుత
Tirumala: బాలిక మృతితో కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
Tirumala: తిరుమలలో దారుణం.. అలిపిరి నడకమార్గంలో చిన్నారిని చంపేసిన చిరుత
Tirumala: తిరుమలలో దారుణం జరిగింది. కొండపై విషాదం నెలకొంది. అలిపిరి కాలినడక మార్గంలో చిరుత దాడిలో ఓ బాలిక మృతి చెందింది. మృతి చెందిన బాలికను లక్షితగా గుర్తించారు. తిరుమలకు కాలినడకన వెళ్తుండగా లక్ష్మీనరసింహస్వామి గుడి వద్ద ఈ ఘటన జరిగింది. నిన్న రాత్రి నుంచి పాప కనిపించకుండా పోయిందని తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఇంతలోనే విషాదం జరిగింది.
అలిపిరి నడక మార్గంలో తిరుమలకు వస్తుండగా.. నరసింహ స్వామి ఆలయం దగ్గర నిన్న రాత్రి లక్షిత అనే పాప కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శనివారం ఉదయం బాలిక మృతదేహాన్ని నరసింహ స్వామి ఆలయం దగ్గర గుర్తించారు. చిన్నారిని చిరుత దాడి చేసి చంపేసినట్టు గుర్తించారు. ఒంటిపై తీవ్ర గాయాలను గుర్తించారు పోలీసులు. పాపను రాత్రే చిరుతపులి దాడి చేసి చంపేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించారు పోలీసులు. బాలిక మృతితో కన్నీరుమున్నీరవుతున్నారు తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు. మరోవైపు.. తిరుమలలో వరుస ఘటనలతో భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు.
రెండు నెలల క్రితం కర్నూలు జిల్లాకు చెందిన ఓ బాలుడిపైనా చిరుత దాడి చేసింది. తాతతో పాటూ ఓ షాపు దగ్గర ఆగిన బాలుడ్ని అటవీ ప్రాంతంలోకి లాక్కెళ్లింది. అదే సమయంలో అటువైపుగా వెళుతున్న పోలీసులు అప్రమత్తమై.. అటవీ ప్రాంతంవైపు వెళ్లి గాలించారు. ఈ క్రమంలో బాలుడ్ని చిరుత వదిలేసి వెళ్లింది. వెంటనే బాలుడ్ని ఆస్పత్రికి తరలించగా.. చికిత్స అందించడంతో కోలుకున్నాడు. ఈ దాడి ఘటన జరిగిన వెంటనే అటవీశాఖ అధికారులు, టీటీడీ అప్రమత్తం అయ్యింది. బోనును ఏర్పాటు చేసి చిరుతను బంధించడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఆ చిరుతను తీసుకెళ్లి దూరంగా అటవీ ప్రాంతంలో వదిలేశారు. చిరుత బెడద తప్పిపోయిందని భావిస్తున్న సమయంలో ఇప్పుడు చిరుత బాలికను చంపేయడం కలకలంరేపుతోంది.