ప్రముఖ వేణుగాన విద్వాంసురాలు డాక్టర్ జయప్రద రామమూర్తికి అరుదైన గౌరవం దక్కింది. ఆమెను తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన ఆధ్యాత్మిక ఛానల్ ఎస్వీబీసీ బోర్డులో డైరెక్టర్‌గా నియమించారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వేణుగాన విద్వాంసురాలైన తొలి మహిళ డాక్టర్ జయప్రదే. అంతర్జాతీయ స్థాయిలో ఆమె కొన్ని వందల ప్రదర్శనలు ఇచ్చారు.
సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సారథ్యంలోని పలు ప్రాజెక్టుల్లో ఆమె పనిచేశారు. ఈ సందర్బంగా ఎస్వీబీసీ చానల్ బోర్డులో డైరెక్టర్‌గా నియమించినందుకు ఏపీ ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలిపారు. జాతీయ కళాకారిణిగా ఇది తనకు వచ్చిన గౌరవమన్నారు. శ్రీ వేంకటేశ్వరుని సేవకు ఈ పదవిని అవకాశంగా భావిస్తున్నానన్నారు. కాగా ఎస్వీబీసీ చైర్మన్ గా పృథ్వి రాజ్ ఉన్న సంగతి తెలిసిందే. అలాగే ఎస్వీబీసీ డైరెక్టర్లుగా సీనియర్ జర్నలిస్ట్ స్వప్న, సినీ దర్శకుడు శ్రీనివాసరెడ్డి లను కూడా నియమించారు.