వికేంద్రీకరణ నిర్ణయాన్ని స్వాగతించాలి: దాడి వీర భద్ర రావు
రాజ్యాంగ వ్యవస్థల వికేంద్రీకరణ ఆలోచన చేస్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు నిర్ణయాన్ని తెలపడాన్ని అందరూ స్వాగతించాలని దాడి.వీరభద్రరావు అన్నారు.
విశాఖపట్నం: రాజ్యాంగ వ్యవస్థల వికేంద్రీకరణ ఆలోచన చేస్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని అసెంబ్లీలో తన నిర్ణయాన్ని తెలపడాన్ని అందరూ స్వాగతించాలని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి.వీరభద్రరావు అన్నారు. పార్టీ నగర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రీకృత వ్యవస్థల వల్ల అసమానతలు పెరుగుతాయని, దీంతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు ఉత్పన్నమవుతాయని పేర్కొన్నారు.
ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని గ్రహించిన సీఎం జగన్ విశాఖ అభివృద్ధికి పూనుకుంటున్నారని చెప్పారు. విశాఖలో సెక్రటేరియట్‌ను ఏర్పాటు చేస్తామని ఆలోచన చేయడం అభినందనీయమన్నారు. ఇదే సందర్భంలో విశాఖను నాశనం చేస్తున్నారని చంద్రబాబు పేర్కొనడం ఆయన అవివేకమని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్ చంద్రబాబు మాటలకు వంత పాడటం మానుకొని ఐదేళ్లలో రాజధానిని ఎందుకు కట్టలేదని గత సీఎంను ప్రశ్నించాలన్నారు.