Coronavirus News: అక్కడ 40 శాతం మందికి కరోనా వచ్చింది..పోయింది! వారికి ఈ విషయమే తెలీదు!

Coronavirus News: కరోనా వస్తుంది పోతుంది.. చాలా మందిలో లక్షణాలే ఉండటం లేదు. అసలు తమకు కరోనా వచ్చింది అనేదే తెలీదు.

Update: 2020-08-20 02:06 GMT
Representational Image

Coronavirus News: కరోనా వస్తుంది పోతుంది.. చాలా మందిలో లక్షణాలే ఉండటం లేదు. అసలు తమకు కరోనా వచ్చింది అనేదే తెలీదు. అలా తెలీకుండానే.. కరోనా బారిన పడి.. వారికి తెలీకుండానే కరోనా నుంచి విముక్తి పొందిన వారు ఒక్క విజయవాడ లోనే 40 శాతానికి పైగా ఉన్నారట. ఈ విషయాన్ని సిరో సర్వైలెన్స్‌, వివిధ రకాల వైరస్‌ నిర్ధారణ పరీక్షల నివేదికలను గణించి అధికారులు చెబుతున్నారు. వీరి లెక్క ప్రకారం విజయవాడలో మొత్తం 43.81 శాతం మందికి కరోనా వైరస్ సోకింది. వీరిలో 40.51 శాతం మందికి అసలు తమకు కరోనా సోకింది అనే విషయమే తెలీదట. వీరిలో ఎవరికీ అనుమానిత లక్షణాలూ లేవట. కానీ, వీరి రక్త నమూనాలు పరిశీలిస్తేనే వారికి వైరస్ సోకి వెళ్ళినట్లు తెలిసిందని అధికారులు చెబుతున్నారు. విజయవాడలో ఇతేఅల కరోనా వైరస్ వ్యాప్తి పై వైద్య ఆరోగ్య శాఖ 'సిరో సర్వైలెన్స్‌' ను నిర్వహించింది.

కృష్ణా జిల్లా వ్యాప్తంగా 3,709 మందిలో 19.41% మందికి వైరస్‌ వచ్చి.. వెళ్లింది. విజయవాడ అర్బన్‌లో 933 మందిలో 378మందిలో కరోనా యాంటీ బాడీలు ఉన్నట్లు తేలింది. భవంతులు, గుడిసెలు, చిన్న ఇళ్లు, అపార్టుమెంట్లు, వైరస్‌ ఎక్కువగా నమోదైన ప్రాంతాల్లో ఎంపిక చేసిన వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు. నగరంలో వైరస్‌ తీవ్ర ప్రభావిత ప్రాంతమైన కృష్ణలంకలో 39 మంది నమూనాలు పరీక్షించగా 16 మందికి వైరస్‌ సోకి నయమైనట్లు తేలింది. రాణిగారితోటలో 40 మందిలో 29, లంబాడిపేటలో 38-18, రామలింగేశ్వరనగర్‌ 43-18, దుర్గాపురం 43-17, మధురానగర్‌-32-20, గిరిపురం-33-18, ఎన్టీఆర్‌ కాలనీ-43-16, ఆర్‌ఆర్‌పేట-40-16, లబ్బీపేట-21-4, పటమటలో 13 మంది నమూనాలు పరీక్షించగా అయిదుగురిలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు గుర్తించారు. గ్రామీణ పరిధిలోని కానూరులో 69మందిలో 8, గొల్లమూడిలో 150-14, చిన్నఓగిరాలలో 134-15, గొల్లపల్లిలో 140 మందిని పరీక్షిస్తూ 9మందిలో యాంటీబాడీలు ఉన్నట్లు గుర్తించారు. మేలో వివిధ ప్రాంతాల్లో నమోదైన కేసులు పరిగణనలోనికి తీసుకొని ఈ పరీక్షలు చేశారు.

''ఈ నెల 6 నుంచి 15వ తేదీ వరకు జరిగిన సిరో సర్వైలెన్స్‌లో అనుమానిత లక్షణాలు కనిపించలేదని చెప్పిన వారికి మాత్రమే పరీక్షలు చేశాం. విజయవాడలో 1,80,000 మందికి పరీక్షలు చేయగా 6,000 మందికి వైరస్‌ సోకింది. నెలరోజుల్లో కేసులు ఇంకా తగ్గుతాయని భావిస్తున్నా. ఇప్పటి వరకు వైరస్‌ సోకిన వారి సంఖ్యను నగర జనాభాతో సాంకేతిక మదింపు చేయగా 43.81మందికి వైరస్‌ సోకిందని అంచనా.''అని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ వివరించారు.   

Tags:    

Similar News