Chandragiri Fort: చంద్రగిరి కోటకు కరోనా ఎఫెక్ట్
Chandragiri Fort: చంద్రగిరి కోట అతి పురాతనమైన కోట విజయనగర రాజుల పాలనలో ఓ వెలుగు వెలిగింది.
Chandragiri Fort: చంద్రగిరి కోటకు కరోనా ఎఫెక్ట్
Chandragiri Fort: చంద్రగిరి కోట అతి పురాతనమైన కోట విజయనగర రాజుల పాలనలో ఓ వెలుగు వెలిగింది. అయితే ఇప్పటికీ ఆ కోటలోని రహస్యాలు మిస్టరీనే. ఒకప్పుడు వెలుగువెలిగిన కోట ఇప్పుడు చీకటిమయమౌతుంది. పర్యాటకులతో కళకళలాడుతూ కనిపించాల్సిన ఈ ప్రాంతం కరోనా కారణంగా వెలవెలబోతోంది. దీనికి తోడు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటోంది.
శతాబ్దాల కాలంనాటి చరిత్రకు ఆనవాళ్ళు చంద్రగిరి కోట. విజయనగర రాజులలో రాయలవారి కాలం నాటి పాలనా రాజధాని. దక్షిణాదిన శ్రీకృష్ణదేవరాయలు పలు సందర్భాల్లో ఈ కోటకు వచ్చారట. శత్రు దుర్భేధ్యమైన కోటను అర్ధ చంద్రాకారంగా ఉన్న కొండ పాద భాగంలో నిర్మించడం వల్ల దీనికి చంద్రగిరి కోట అనే పేరు వచ్చింది. కోటలోపల ఎన్నో అద్భుతమైన కట్టడాలున్నాయి. సున్నితమైన అంశాలను తెలియజేసే చారిత్రక ఆనవాళ్ళున్నాయి. సంస్కృతి సాంప్రదాయాలను తెలిపే మరెన్నో వింతలు విశేషాలకు నిలయం ఈ ప్రాంతం. కొండలమాటున కాశిరాళ్లతో పెద్దపెద్ద రాతి మండపాలు ఇక్కడ హైలెట్. శతృదుర్భెద్యమైన కోట గోడలు కొండమీద నిర్మించిన దుర్గం ఇలా ఒకటేమిటి అడుగడుగునా అద్బుతాలకు ఆలవాలం.
కొన్నేళ్ళుగా చంద్రగిరి కోటకు పర్యవేక్షణ కొరవడింది. కట్టడాలను ఆకర్షణీయంగా మలిచి పర్యాటకుల దృష్టిని ఆకర్షించాల్సింది పోయి అధికారుల నిర్లక్ష్య ధోరణితో కోట చిరిత్ర మరుగునపడుతోంది. అడపాదడపా వచ్చిన వారు మళ్ళీ విజిట్ చేయలేని పరిస్థితి నెలకొంటోంది. కరోనాకు ముందు అంతో ఇంతో పర్యాటకులు వచ్చినా ఆ తరువాత జనాలు అటువైపు వెళ్ళడమే మరచిపోతున్నారు. ఒకప్పడు రోజుకు లక్ష రూపాయల ఆదాయం వస్తే ప్రస్తుతం ఐదువేల రూపాయలకు కూడా రాని పరిస్థితి నెలకొంది.
కొండపై నిర్మించిన కట్టడాలు రోజురోజుకు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. దీంతో భావితరాలకు చరిత్ర గురించి తెలుసుకునే అవకాశం లేకుండా పోయే ప్రమాదం ఉంది. చంద్రగిరి కోట నిర్మాణం, పూర్వం రాజులు నిర్మించిన భవనాలను కాపాడాల్సిన పురావస్తు శాఖ ఆ దిశగా అడుగులు వేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రగిరికి సమీపంలో అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నప్పటికీ, అవి అభివృద్ధికి నోచుకోవడం లేదని పర్యాటకులు అంటున్నారు.
కోట ప్రాకారం లోపల ఎన్నో మండపాలు శిధిలావస్థకు చేరుకున్నాయి. పిడుగులు పడి పగిలిన భాగాలను కూడా యేళ్ళ తరబడి పట్టించుకోలేదు. రాయలవారి కాలంనాటి శిల్పాలతో పాటు బ్రిటిష్ వారి పాలనా కాలంలో నిర్మించిన అనేక కట్టడాల రూపురేఖలు మారిపోతున్నాయి. ఘన చరిత్ర కలిగిన కట్టడాలను పరిరక్షించాల్సిన భాధ్యత ప్రభుత్వంపైన, పురావస్తు శాఖపైనా ఉంది. అయినా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం శోచనీయం.
కోట సమీపంలోని ఆకర్షణీయమైన ప్రాంతాలలో తాటికోన ఒకటి. ఇక్కడి తాటి వనంలో విశాలంగా పెద్దపెద్ద తాటి వృక్షాలు గతంలో ఉన్నట్లు స్థానికులు చెబుతుంటారు. ఇక్కడ రెండో మూడో తాటి చెట్లు తప్ప ఇప్పుడు తాటి వనం ఊసే కనబడదు. ప్రస్తుతం ఇక్కడ పురాతన నిర్మాణాల ఆనవాళ్ళు అనేకం శిథిలమై కనిపిస్తాయి. ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలలో గుప్తనిధుల తవ్వకాలు కూడా అధికంగా జరిగేవి. దీంతో తీవ్ర నష్టం వాటిల్లుతోంది. కరోనా కారణంగా రెండేళ్ళుగా పర్యాటనలకు దూరమైన ప్రజలు ఇప్పుడిప్పుడే టూర్లకు ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సమయంలో పర్యాటకశాఖ, పురావస్తు శాఖ సంయుక్తంగా చర్యలు చేపడితే చంద్రగిరి పూర్వవైభవం సంతరించకమానదు.