పోలవరం-బనకచర్ల అనుసంధానికి సీఎం పచ్చజెండా

ఏటా వృథాగా సము ద్రంలో కలుస్తున్న వేల టీఎంసీల గోదావరి జలాలను రాయలసీమతోపాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తరలించే ప్రణాళికలో మరో కీలక ముందడుగు పడింది.

Update: 2019-12-21 07:46 GMT

ఏటా వృథాగా సము ద్రంలో కలుస్తున్న వేల టీఎంసీల గోదావరి జలాలను రాయలసీమతోపాటు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తరలించే ప్రణాళికలో మరో కీలక ముందడుగు పడింది. గోదావరి నీటిని తరలించే బృహత్తర కార్యాచరణ రూపుదిద్దుకుంటోంది. పోలవరం–బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ (బీసీఆర్‌) అనుసంధానం పనులను రాబోయే నాలుగేళ్లలోగా పూర్తిచేయాలని జలవనరుల శాఖ అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. పోలవరం–బీసీఆర్‌ అనుసంధానంపై జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్ మరియు ఇతర ఉన్నతాధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ శుక్రవారం తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా పోలవరం–బనకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ (బీసీఆర్‌) అనుసంధానం పనులకు ఆమోద ముద్ర వేశారు. ఆ ప్రతిపాదన ఇలా ఉంది. పోలవరం కుడి కాలువ ప్రస్తుత సామర్థ్యం 17,633 క్యూసెక్కులుగా ఉంది.. అయితే దీన్ని మరో 23,144 క్యూసెక్కుల (రెండు టీఎంసీలు)కు పెంచుతారు. అప్పుడు మొత్తం 40,777 క్యూసెక్కుల గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలిస్తారు. అక్కడినుంచి ప్రకాశం బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతం మీదుగా రెండు టీఎంసీలను నాగార్జునసాగర్‌ కుడి కాలువలో 80 కి.మీ వద్దకు పంపింగ్ చేస్తారు.

పెదకూరపాడు నియోజకవర్గం బొల్లాపల్లి వద్ద 150 నుంచి 200 టీఎంసీల సామర్థ్యంతో ఏర్పాటు చేసే రిజర్వాయర్‌ కు తరలిస్తారు. గుంటూరు జిల్లాలో అవసరమైన ప్రాంతాలకు పిల్ల కాలువల ద్వారా పంపించి.. అలాగే బొల్లాపల్లి నుంచి వెలిగొండ ప్రాజెక్టు ద్వారా పశ్చిమ ప్రకాశం ఆయకట్టుకు నీటిని అందిస్తూనే.. నల్లమల అడవుల్లో సుమారు 20 కి.మీ నుంచి 25 కి.మీల పొడవున సొరంగం ద్వారా బీసీఆర్‌లోకి గోదావరి జలాలను తరలిస్తారు. అక్కడ నుంచి గోదావరి నీటిని గాలేరు–నగరి, తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్‌ ఆయకట్టుకు సరఫరా చేసేలా డీపీఆర్‌ను వ్యాప్కోస్‌ ప్రతినిధులు తయారు చేస్తున్నారు.

ఇదిలావుంటే వేలాది టీఎంసీల గోదావరి నీరు సముద్రంలోకి వృధాగా పోతోంది. 1990 నుంచి సముద్రంలో కలిసిన గోదావరి జలాలు ఇలా ఉన్నాయి.. 1990లో 7,094 టీఎంసీల నీరు ఒక్క ఏడాదిలో సముద్రంలోకి వెళ్లింది. గడిచిన పదేళ్లలో చూస్తే .. 2010–11లో 4,053 టీఎంసీలు, 2013–14లో 5,827 టీఎంసీలు, గతేడాది 2,446 టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోయింది. సరాసరిన ఏటా 3,500 టీఎంసీల నీరు సముద్రం పాలవుతోందని జలవనరుల శాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. ఈ నీటిని ఒడిసిపట్టుకుంటే దుర్భిక్ష ప్రాంతాలను సస్యశ్యామలం చెయ్యొచ్చని చెబుతున్నారు. 

Tags:    

Similar News