కోటంరెడ్డి - కాకాని వివాదంపై జగన్ ఆగ్రహం

Update: 2019-10-09 14:18 GMT

నెల్లూరు జిల్లా వైసీపీ నేతల పంచాయతీ ముఖ‌్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి దగ్గరకు చేరింది. ముఖ్యంగా కోటంరెడ్డి-కాకాని వివాదంపై జగన్ సీరియస్‌ అయ్యారు. నేతల మధ్య విభేదాలు, సమన్వయ లోపంపై మండిపడుతోన్న జగన్మోహన్ రెడ్డి పరిస్థితిని చక్కదిద్దేందుకు యాక్షన్ మొదలుపెట్టారు. నెల్లూరు నేతలను తాడేపల్లికి పిలుపించుకున్న సీఎం జగన్‌ మరికాసేపట్లో వాళ్లతో సమావేశంకానున్నారు.

నెల్లూరు జిల్లా వైసీపీలో నేతల మధ్య విభేదాలు వీధికెక్కడంపై సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర అసహనంతో ఉన్నారు. ముఖ్యంగా కోటంరెడ్డి-కాకాని గొడవపై జగన్ మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చి, ఇంకా ఆర్నెళ్ల కూడా పూర్తికాకముందే ఈ గొడవలేంటని ఇప్పటికే స్ట్రాంగ్ క్లాస్ పీకిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు స్వయంగా సమావేశమవుతున్నారు. అయితే, కోటంరెడ్డి-కాకాని వివాదమే కాకుండా, మిగతా నేతల మధ్య కూడా సరిగా సఖ్యత లేదని గుర్తించిన జగన్మోహన్ రెడ్డి. విభేదాలను పక్కనబెట్టి కలిసి పనిచేయాలని, రైతు భరోసా పథకం ప్రారంభోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించనున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి.

అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న రైతు భరోసా పథకాన్ని నెల్లూరు నుంచి ప్రారంభించబోతున్న నేపథ్యంలో సింహపురి నేతలతో జగన్ సమావేశమవుతున్నారు. రైతు భరోసా పథకం ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీని ఆహ్వానించినందున కార్యక్రమం విజయవంతం చేయాలంటూ నేతలకు సూచించనున్నారు. 

Tags:    

Similar News