పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ ఫోకస్‌

Update: 2020-12-11 10:43 GMT

పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దృష్టిపెట్టారు. 2021 డిసెంబర్ నాటికి ఎట్టిపరిస్ధితుల్లోనూ పోలవరాన్ని పూర్తిచేసి 2022 ఖరీఫ్‌కు నీళ్లిస్తామన్న సీఎం జగన్ ఆ దిశగా చర్యలు చేపడుతున్నారు. పోలవరం పనుల్లో వేగం పెంచేందుకు క్షేత్రస్థాయి పర్యటనకు సిద్ధమయ్యారు. ఈనెల 14న పోలవరం వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్మాణ పనులను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. అనంతరం, అధికారులతో సమావేశమై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నారు. పోలవరం పనుల్లో వేగం పెంచేందుకు ఇరిగేషన్ అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

పోలవరం ఎత్తు ఒక్క అంగుళం కూడా తగ్గదని అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. 45.72 మీటర్ల ఎత్తు కచ్చితంగా ఉంటుందన్నారు. అలాగే, 2022 ఖరీఫ్‌కు పోలవరం నీళ్లిస్తామని చెప్పారు. అయితే పోలవరం పూర్తి చేసేందుకు ఇంకా 37 వేల 885 కోట్ల రూపాయలు అవసరమవుతాయన్న సీఎం జగన్ నిధుల సమీకరణ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. పెరిగిన అంచనాల మేరకు కేంద్రం నుంచి నిధులను తెచ్చుకునేందుకు ఢిల్లీకి మంత్రుల బృందాన్ని పంపారు.

ఈరోజు ఢిల్లీ వెళ్లిన ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్ కేంద్ర జలవనరుల మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో సమావేశమయ్యారు. పోలవరం ప్రాజెక్టు తుది అంచనా వ్యయంపై చర్చించారు. ప్రాజెక్టుకు నిధులు సమకూర్చడంపై కేంద్రం సానుకూలంగా స్పందించినట్టు మంత్రులు తెలిపారు. ప్రాజెక్ట్ పనులను పరిశీలించాలని షెకావత్‌ను కోరగా 15 రోజుల్లోగా వస్తానని షెకావత్‌ చెప్పారని వెల్లడించారు. 

Tags:    

Similar News