కాసేపట్లో పోలవరానికి సీఎం జగన్‌..

Update: 2020-12-14 05:05 GMT

ఏపీ సీఎం జగన్ ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు. నిర్మాణ పనులతో పాటు స్పిల్ వే, స్పిల్ ఛానల్ పనులను ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. 2022 ఖరీఫ్‌ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి నీరు అందించాలనేది లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. దీంతో జగన్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కాసేపట్లో సీఎం జగన్ పోలవరం పనులను పరిశీలించనున్నారు. అనంతరం నిర్మాణ పనులపై సమీక్ష నిర్వహించనున్నారు. అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం జగన్‌తో పాటు మంత్రులు అనిల్‌కుమార్‌ యాదవ్‌, పేర్ని నాని ప్రాజెక్టును సందర్శించనున్నారు.

ఇటీవల పోలవరం అంచనాల విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరిగింది. చంద్రబాబు 2014 అంచనాలకు అంగీకరించడం వల్లే కొత్త అంచనాలను ఆమోదించేందుకు కేంద్ర ఆర్థికశాఖ కొర్రీలు పెడుతుందని ప్రభుత్వం చెబుతుంటే చేతకానితనం వల్లే పోలవరం నిధులు తెచ్చుకోలేక పోతున్నారని టీడీపీ ఆరోపణలు చేసింది. అయితే ఇటీవల రాష్ట్ర మంత్రులు బుగ్గన, అనిల్ కుమార్ కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిసి ప్రాజెక్టు కొత్త అంచనాలు ఆమోదించాలని కోరారు. దీనికి షెకావత్ కూడా సానుకూలంగా స్పందించారని మంత్రులు చెబుతున్నారు. మంత్రుల ఆహ్వానంతో త్వరలోనే పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తానని షెకావత్ చెప్పారని తెలిపారు. ఈ నేపధ్యంలో పనుల్లో వేగాన్ని పెంచేందుకు స్వయంగా సీఎం పర్యటిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News