Distribution of RoFR postponed: కరోనా నేపథ్యంలో పట్టాల పంపిణీ వాయిదా.. అక్టోబరు 2న నిర్వహణ

Distribution of RoFR postponed: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో గిరిజన పోడు పట్టాల పంపిణీని వాయిదా వేసినట్టు ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి ట్వీట్ చేశారు.

Update: 2020-08-10 02:35 GMT
tribal land rights

Distribution of RoFR postponed: కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో గిరిజన పోడు పట్టాల పంపిణీని వాయిదా వేసినట్టు ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి ట్వీట్ చేశారు. అయితే వీటికి సంబంధించి ఎంపిక, పట్టాల తయారీ ఇప్పటికే పూర్తయినా కేవలం కరోనా వైరస్ కారణంగానే వాయిదా వేశామన్నారు. వీటిని అక్టోబరు 2న కురుపాంలో పంపిణీ ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.

దేశంలో కోవిద్-19 కరాళనృత్యం చేస్తోంది. రోజురోజుకు భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో గిరిజన జాతులను, వారి సంస్కృతిని మరింత సంరక్షించేందుకు అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నామని జగన్ ప్రకటించారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జగన్ ట్వీట్ చేశారు. ఆదివాసీలకు భూమి హక్కు పత్రాల పంపిణీ కరోనా వ్యాప్తి కారణంగా అక్టోబర్ 2కు వాయిదా వేశామని తెలిపారు. గాంధీ జయంతి రోజున కురుపాంలో గిరిజన ఇంజినీరింగ్ కాలేజీకి శంకుస్థాపన, పాడేరులో వైద్య కళాశాల, గిరిజన వర్సిటీకి భూమి పూజ చేస్తామని చెప్పారు. అదే రోజు ఐటీడీఏల పరిధిలో 7 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులను ప్రారంభిస్తున్నామని జగన్ తెలిపారు

ఏళ్ల తరబడి సాగుచేసుకుంటున్న గిరిజనుల భూములకు పట్టాలు మంజూరు చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అటవీ హక్కుల చట్టంలో భాగంగా 2005 డిశెంబరుకు ముందు అటవీ భూమిలో సాగులో ఉన్న వారందరికీ పట్టాలు ఇవ్వాలని చట్టం చెబుతున్నా, స్థానిక కారణాలు, అటవీ అధికారుల వల్ల వీటి పంపిణీ పూర్తిస్థాయిలో జరగలేదు. ప్రారంభంలో దివంగత నేత వైఎస్ చాలావరకు పట్టాలు పంపిణీ చేయగా, తరువాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. అయితే తాజాగా అధికారంలోకి వచ్చిన జగన్ నిబంధనల ప్రకారం సాగులో ఉన్నవారందరకీ పట్టాలు పంపిణీ చేయాలని నిర్ణయంచి, దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. క్లెయిములను పరిశీలించి గిరిజనులకు మేలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆగస్టు 9 ఆదివాసీ దినోత్సవం రోజున గిరిజనులకు పట్టాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలపై శుక్రవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. అటవీ భూములపై సాగు హక్కుల కోసం చాలా కాలంగా వేచి చూస్తున్న గిరిజనులకు ప్రయోజనం కల్పించాలని సీఎం స్పష్టం చేశారు.

అర్హత ఉన్న వారందరికీ సాగు హక్కులు కల్పించాని, పట్టాలు ఇచ్చాక ఆయా భూముల అభివృద్ధిపై కార్యాచరణ తయారు చేయాలన్నారు. ఆ భూముల్లో ఏయే పంటలు సాగు చేయాలన్న దానిపై ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని సూచించారు. ఇందుకోసం వ్యవసాయ, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇందుకోసం గిరిభూమి పేరుతో పోర్టల్‌ను ప్రారంభిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు. 

Tags:    

Similar News