CM Jagan: వై నాట్ 175 టార్గెట్‌గా అసెంబ్లీ ఎన్నికలపై సీఎం జగన్ ఫోకస్
CM Jagan: మళ్లీ అధికారం చేపట్టే దిశగా కసరత్తు వేగవంతం చేసిన వైసీపీ బాస్
CM Jagan: వై నాట్ 175 టార్గెట్‌గా అసెంబ్లీ ఎన్నికలపై సీఎం జగన్ ఫోకస్
CM Jagan: వై నాట్ 175 టార్గెట్‌గా అసెంబ్లీ ఎన్నికలపై ఏపీ సీఎం జగన్ ఫోకస్ పెట్టారు. మళ్లీ అధికారం చేపట్టే దిశగా వైసీపీ బాస్ కసరత్తు వేగవంతం చేశారు. ఇప్పటికే అభ్యర్థుల మార్పులపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టారు. మొదటి విడతలో 11 మంది ఇంచార్జ్‌లను మార్పు చేసిన సీఎం జగన్.. అదే తరహాలో రెండో జాబితా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. అయితే రెండో విడతలో ఎవరెవరికి సీటు దక్కడం లేదన్నదానిపై ఇప్పటికే అధిష్టానం నుంచి ఆయా ఆయా అభ్యర్థులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తల్లో మార్పులు పూర్తిగా సర్వేలపైనే ఆధారపడ్డారు వైసీపీ బాస్.
ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతో పాటు పలు సీట్లపై వైసీపీ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. సెకండ్ ఫేజ్ మార్పుల కోసం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో సీఎం జగన్ నేరుగా రంగంలోకి దిగారు. ఒకటి, రెండు రోజుల్లో కొత్త సమన్వయకర్తలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మంతనాలు సాగుతున్నాయి. విజయమే అంతిమ లక్ష్యంగా మార్పులు చేర్పుల గురించి నేతలకు సీఎం వివరిస్తున్నారు. సీటు నిరాకరిస్తున్న వారికి భవిష్యత్‌పై హామీ ఇస్తున్నారు. పార్టీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా నిర్ణయాలు తప్పటం లేదని సీఎం వివరిస్తున్నారు. ప్రస్తుతం సీఎంవో నుంచి పిలుపు వచ్చిన ఎమ్మెల్యేలకు టెన్షన్ పట్టుకుంటోంది.
అందులో భాగంగా గోదావరి ,గుంటూరు జిల్లాలకు చెందిన వారికి సీఎంఓ నుంచి పిలుపు రావటంతో గోదావరి జిల్లాల్లోని పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, చింతలపూడి, రామచంద్రాపురం ఎమ్మెల్యేలు క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. క్యాంపు కార్యాలయానికి వచ్చిన మంత్రి చెల్లుబోయిన వేణు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబులు వచ్చారు. జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ప్రత్తిపాడు పర్వత పూర్ణ చంద్ర ప్రసాద్, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, రాజమండ్రి ఎమ్పీ మార్గాని భరత్, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యేల మద్దాల గిరిలు కూడా సీఎంఓకు వచ్చారు. ఒక్కొక్కరితో వేర్వేరుగా సీఎం జగన్ సమావేశం అయినట్లు సమాచారం. ఎవరికి ఏ కారణంతో టికెట్ నిరాకరిస్తుందీ సీఎం వివరించినట్లు సమాచారం. మరో వైపు వారి స్థానంలో నియమించే వారి సమాచారం కూడా అందించి.. సహకరించాలని సూచిస్తున్నారు. తిరిగి అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తున్నారు.
ఇప్పటికే పలు నియోజకవర్గాలకు వైసీపీ ఇంఛార్జులను మార్చారు. మరికొంత మంది ఎమ్మెల్యేలతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవడం ఎంత ముఖ్యమనే అంశాలపై ఈ భేటీలో వివరించినట్లు సమాచారం. ఇంచార్జులను నియమించినంత మాత్రాన సీట్లు దక్కవని అనుకోవద్దని.. పార్టీలో కచ్చితంగా ప్రాధాన్యం ఉంటుందని చెబుతున్నారు. అయితే ప్రతి ఒక్కరూ పార్టీకోసం కష్ట పని చేయాలని, వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని సీఎం జగన్ సూచిస్తున్నారని తెలుస్తోంది.