CM Jagan: అభ్య‌ర్ధుల ఎంపిక‌లో సీఎం జ‌గ‌న్ బిజీబిజీ

CM Jagan: టికెట్ దక్కని వారి రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇస్తున్న అధినేత

Update: 2023-12-20 10:19 GMT

CM Jagan: అభ్య‌ర్ధుల ఎంపిక‌లో సీఎం జ‌గ‌న్ బిజీబిజీ

CM Jagan: రాబోయే ఎన్నికల్లో వై నాట్ 175 టార్గెగ్‌గా ముందుకెళ్తున్న సీఎం జగన్ దానికి త‌గ్గ‌ట్లుగా కొత్త టీం సెట్ చేసుకునే ప‌నిలో ప‌డ్డారు. ఎన్నికలకు మరో మూడు, నాలుగు నెలలు మాత్రమే ఉండటంతో అభ్య‌ర్ధుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు వేగ‌వంతం చేసారు. పనితీరు బాగాలేని ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ ఇవ్వడం లేదని తేల్చి చెబుతున్నారు.

మరి కొంతమందిని పక్క నియోజకవర్గాలకు బదిలీ చేస్తున్నారు. అందులో భాగంగానే సీటు కోల్పోతున్న సిట్టింగ్‌లను తాడేప‌ల్లికి పిలిపించి వారితో మాట్లాడుతున్నారు జగన్. సర్వే ఫలితాలను ఎమ్మెల్యేల ముందు ఉంచి గ్రాఫ్ బాగోలేని చోట పోటీచేసినా ప్ర‌యోజ‌నం లేద‌ని చెబుతున్నారు. సీటు రాని వారి రాజ‌కీయ భ‌విష్య‌త్ కు తనది గ్యారంటీ అంటున్నారు సీఎం జ‌గ‌న్.

ఇప్పటికే 11 స్థానాలకు కొత్త ఇంఛార్జులను నియమించిన జగన్.. రెండో జాబితా సిద్దం చేసే ప‌నిలో ప‌డ్డారు. గత రెండు రోజులుగా పలు జిల్లాల నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేల‌ను తాడేప‌ల్లికి పిలిచి వారితో మాట్లాడారు. వీరంతా సీటు కోల్పోతున్న వారే కావ‌డం విశేషం. సీటు ఎందుకు ఇవ్వ‌డం లేదు. స్థానిక ప‌రిస్థితులు ఎలా ఉన్నాయి, ఎమ్మెల్యే పనితీరు పట్ల ప్రజలు ఏమనుకుంటున్నారో అనే అంశాల‌ను పార్టీ పెద్ద‌లు వివ‌రిస్తున్నారు.

గ‌డ‌ప గ‌డ‌పకు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం ప్రారంభం నాటి నుంచి ఉన్న స‌ర్వే నివేదిక‌ల ఆధారంగా వారి సీట్ల‌పై నిర్న‌యం తీసుకుంటున్నారు. రెండు రోజుల్లో సుమారు 20 మంది ఎమ్మెల్యేల‌కు వైసీపీ అధిష్టానం నుంచి పిలుపు వెళ్లింది. వీరంతా సీఎం జ‌గ‌న్ తో వేర్వేరుగా భేటీ అయ్యారు. కొంత‌మంది ఎమ్మెల్యేల‌కు అస‌లు సీటు లేద‌ని చెప్తుంటే మ‌రికొంత‌మందిని ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌కు మార్పులు చేస్తున్నారు. ఎమ్మెల్యేల‌తో పాటు కొంత‌మంది ఎంపీలు కూడా సీఎంను క‌లిసిన వారిలో ఉన్నారు.

ఫస్ట్ లిస్టులో గుంటూరు, ప్రకాశం జిల్లాల అభ్యర్థుల జాబితాను ప్రకటించింది వైఎస్సార్సీపీ అధిష్టానం. ఇపుడు ఉమ్మడి గోదావరి జిల్లాల నేతల లిస్ట్ ఫైనల్ చేస్తున్నారు. మరోవైపు రాయలసీమ నేతల లిస్ట్ కూడా కసరత్తు చేస్తున్నారు పార్టీ పెద్దలు. ఒక్కొక్కరిగా ఎమ్మెల్యే లకు ఫోన్ లు చేసి పిలిపించి వారితో స్థానిక స‌మీక‌ర‌ణాల గురించి మాట్లాడుతున్నారు. ఎంత పెద్ద లీడర్ అయినా పార్టీ తీసుకొన్న నిర్ణయానికి కట్టుబడి వుండాల్సిందేనని స్ప‌ష్టం చేస్తున్నాయి పార్టీ వర్గాలు. ఇప్పటి వరకు సీఎంని కలసిన వారిలో టిక్కెట్ లేద‌ని కొంత‌మందికి చెప్పేసారు.

వారిలో జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, ప్ర‌త్తిపాడు ఎమ్మెల్యే ప‌ర్వ‌త ప్ర‌సాద్, పిఠాపురం ఎమ్మెల్యే పెండెం దొరబాబు, పి గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణా రెడ్డి, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మ‌ద్దాల‌ గిరిధ‌ర్,సంతనూతలపాడు ఎమ్మెల్యే TJR సుధాకర్ బాబు ఉన్నారు. ఇక మార్పులు చేర్పులు చూస్తే ప్రతిపాడుకు వ‌రుపుల సుబ్బారావును, రాజ‌మండ్రి రూర‌ల్ కు మంత్రి వేణుగోపాల్ ను పంపించ‌నున్న‌ట్లు తెలిసింది.

రాజ‌మండ్రి ఎంపీ మార్గాని భ‌ర‌త్ ను రాజ‌మండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్య‌ర్ధిగా ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. కాకినాడ ఎంపీ వంగా గీత‌ను పిఠాపురం ఎమ్మెల్యే అభ్య‌ర్ధిగాను ఎంపిక చేసిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

అమ‌లాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పినిపె విశ్వ‌రూప్ ను పి.గ‌న్న‌వ‌రం లేదా పాయ‌క‌రావు పేట నుంచి బ‌రిలో దింపే చాన్స్ ఉంది. రాజోలు జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక వ‌ర‌ప్ర‌సాద్ ను అమ‌లాపురం ఎంపీగా పంపించే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు తెలిసింది. ఎమ్మెల్యే రాపాకతో పాటు పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశ‌య్య, న‌ర‌సాపురం ఎమ్మెల్యే ప్ర‌సాద‌రాజు కూడా సీఎంను క‌లిసారు. మ‌రోవైపు రాయ‌ల‌సీమకు చెందిన కొంత‌మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా సీఎంను క‌లిసారు.

వీరిలో మంత్రి గుమ్మ‌నూరు జ‌యరాం, మాజీ మంత్రి శంక‌ర నారాయ‌ణ ఉన్నారు. మైదుకూరు ఎమ్మెల్యే ర‌ఘురామి రెడ్డి కూడా సీఎంను క‌లిసారు. రాయ‌దుర్గం ఎమ్మెల్యే కాపు రామ‌చంద్రారెడ్డికి కూడా సీటు ఇవ్వ‌డం లేద‌ని తెల‌సింది. ఈయ‌న కూడా సీఎం కార్యాల‌యానికి వ‌చ్చి జ‌గ‌న్ ను క‌లిసారు. సెకండ్ లిస్ట్ ఎప్పుడైనా రావొచ్చు అంటున్నాయి పార్టీ వర్గాలు. ప్ర‌తి రోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సీఎం అభ్య‌ర్ధుల ఎంపిక ప‌నిలోనే ఉంటున్నారు. సీఎంతో భేటీ త‌ర్వాత చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు అధిష్టానం నిర్న‌యమే ఫైన‌ల్ అని చెబుతున్నారు.

Tags:    

Similar News