మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపై చంద్రబాబు, దగ్గుబాటి

మూడు దశాబ్దాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకే వేదికను పంచుకున్నారు.

Update: 2025-03-06 07:40 GMT

మూడు దశాబ్దాల తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఒకే వేదికను పంచుకున్నారు. ఇందుకు విశాఖపట్టణం గురువారం వేదిక అయింది. దగ్గుబాటి వెంకటేశ్వరరావు రాసిన ప్రపంచ చరిత్ర పుస్తక ఆవిష్కరణలో చంద్రబాబు పాల్గొన్నారు.

చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావులు తోడళ్లులు. టీడీపీలో 1995 ఆగస్టు సంక్షోభం సమయంలో ఈ ఇద్దరు కలిసే ఉన్నారు. ఎన్టీఆర్ అప్పట్లో సీఎం పదవిని కోల్పోయారు. చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. చంద్రబాబు సీఎం పదవి చేపట్టడానికి దగ్గుబాటి వెంకటశ్వరరావు సపోర్టు ఉంది. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాల్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు మధ్య గ్యాప్ పెరిగింది.

దీంతో ఆయన టీడీపీకి దూరమయ్యారు. ఆ తర్వాత ఆయన బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్‌సీలలో చేరారు. 2023 జనవరి 17న క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్టు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు. వీరిద్దరి మధ్య గ్యాప్ ఉన్నప్పటికి ఆ కుటుంబంలోని పిల్లలు మాత్రం తరచుగా కలుసుకొనేవారు. వీరిద్దరూ మాత్రం ఒకే వేదికను మాత్రం పంచుకోలేదు.

2022 జూన్ 21న అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దగ్గుబాటి వెంకటేశ్వరరావును హైదరాబాద్ జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో చంద్రబాబు పరామర్శించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు రెండు స్టెంట్లు అమర్చారు. ఈ ఘటనకు ముందు కుటుంబంలో జరిగిన ఓ ఫంక్షన్ లో వీరిద్దరూ కలిశారు. ఈ ఫోటోలు అప్పట్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

మార్చి 6న విశాఖపట్టణంలో జరిగిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ సభకు రావాలని చంద్రబాబును మార్చి 2న దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆహ్వానించారు. దీంతో చంద్రబాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముప్పై ఏళ్ల తర్వాత ఒకే వేదికను పంచుకున్న సమయంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావును చంద్రబాబు ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు.

Tags:    

Similar News