Pemmasani Chandrasekhar: కేంద్ర మంత్రి పెమ్మసాని.. శంకర్ విలాస్ ఆర్ఓబి వివాదం రచ్చ

ఇమేజ్.. డామేజ్ హంగు, ఆర్భాటంలో పెమ్మసానికి సాటిలేరు ఎంపీగా గెలిచిన తొలిసారే కేంద్ర మంత్రిగా జాక్‌పాట్ అన్నింటా క్రెడిట్ కోసం పెమ్మసాని చేస్తున్న ప్రయత్నాలు విఫలం

Update: 2026-01-06 08:31 GMT

Pemmasani Chandrasekhar: కేంద్ర మంత్రి పెమ్మసాని.. శంకర్ విలాస్ ఆర్ఓబి వివాదం రచ్చ

హంగు, ఆర్భాటంలో ఆయనకు సాటిలేరు. ఇమేజ్ పెంచుకునేందుకు ఆయన పడే తపన అంతా ఇంతా కాదు. రాజకీయాలకు కొత్తే ఐనా..తొలిసారే గెలిచినా హస్తిన టు అమరావతి వరకు తన హవా నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అన్నింటా క్రెడిట్ కోసం ఆయన చేసే ప్రయత్నాలు వికటిస్తున్నాయి. అది ఆయనకూ...ఆయన్ను నమ్ముకున్న పార్టీకి తీవ్ర నష్టం చేస్తోందట. ఎక్కడికి వెళ్లినా.. ప్రస్తుతం ఆయన పరిస్థితి అనుకున్నదొక్కడి అయిన్నదొక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట అన్న చందంగా ఉందట. ఇంతకి ఎవరా ప్రముఖుడు. ఎక్కడ సీన్ రివర్స్ అయింది. 


పెమ్మసాని చంద్రశేఖర్. గుంటూరు ఎంపీ. కూటమి హవాలో టీడీపీ ఎంపీగా గెలిచిన తొలిసారే కేంద్ర మంత్రిగా జాక్‌పాట్ కొట్టారు. ఐతే ఇప్పుడా నేత ప్రతీ చోటా క్రెడిట్ కోసం పరితపిస్తూ.. పప్పులో కాలు వేస్తున్నాడట. ఆనాలోచిత తీరుతో.. ఆయనకూ, పార్టీకి నష్టం తెచ్చి పెడుతోందట. గుంటూరు నగరంలో.. ఓ బ్రిడ్జి నిర్మాణం విషయంలో ఆయన తీసుకున్న తొందరపాటు చర్యలు ప్రజలకు తిప్పలు తెచ్చిపెడుతోందట.


గుంటూరు నగరానికి శంకర్ విలాస్ బ్రిడ్జి మణిహారం లాంటింది. ఆరున్నర దశాబ్దాల క్రితం ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగింది. నాటి నుంచి నిన్నటి వరకు నగర ప్రజల రాకపోకలకు వారధిగా నిలిచింది. ఐతే నగరంలో పెరిగిన జనాభాతో పాటు వాహనాల సంఖ్యా అధిగమవుతోంది. దీంతో గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలను కలిపే ఈ బ్రిడ్జిపై ఒత్తిడి పెరిగిందట. ఫలితంగా నగరంలో ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. శంకర్ విలాస్ బ్రిడ్జి వద్ద తరచూ ట్రాఫిక్ జామ్‌లతో ప్రజలు ఇబ్బందులు పడ్డుతున్నారు.


క్రమంగా గుంటూరు నగరంలో.. శంకర్ విలాస్ ఆర్ఓబి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మించాలన్న డిమాండ్ పెరిగింది. 2014, 2019లో గుంటూరు ఎంపీగా గెలిచిన గల్లా జయదేవ్.. శంకర్ విలాస్ ఆర్ఓబి స్థానంలో కొత్త బ్రిడ్జి నిర్మించాలని ప్రతిపాదనలు పెట్టారు. 165కోట్లతో డీపీఆర్ కూడా రెఢీ అయ్యింది. కానీ నిధులు మంజూరు కాక.. పనులు ముందుకు సాగలేదు. గత ఎన్నికల్లో గుంటూరు ఎంపీగా గెలిచిన పెమ్మసానికి కూడా కొత్త బ్రిడ్జి నిర్మాణానికి ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. స్థానిక ప్రజల డిమాండ్ మేరకు..కేంద్ర ప్రభుత్వం సేతుబంధన్ పథకం కింద కొత్త ఆర్ఓబి నిర్మాణానికి 97కోట్లు నిధులు విడుదల చేసింది. దీంతో ఆ నిధులతో కొత్త ఆర్ఓబి నిర్మించాలని కేంద్రమంత్రి పెమ్మసాని భావించారు. అయితే ఆర్ఓబి నిర్మాణానికి అవసరమైన భూసేకరణ, స్థలాలు కోల్పోయే వ్యాపారుల అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఆర్ఓబి నిర్మాణం మొదలుపెట్టకపోవడం ఇప్పుడు వివాదాలకు దారితీస్తుంది.....


అధికారులు ఏకపక్షంగా బ్రిడ్జి కూల్చివేత పనులు మొదలుపెట్టారు. మరోవైపు కొత్త బ్రిడ్జి నిర్మాణం వల్ల స్థలాలు కోల్పోయే కొంతమంది వ్యాపారులు హైకోర్టుకు వెళ్లారు. వారి వాదనలు విన్న కోర్టు.. స్థలాలు కోల్పోయే వారికి భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించాలని సూచించింది. ఇదే సమయంలో రెండు వైపులా బ్రిడ్జి కూల్చివేత పూర్తైనా రైల్వే ట్రాక్ పై ఉన్న బ్రిడ్జిని కూల్చడానికి ఇప్పటికీ రైల్వే అధికారుల నుంచి అనుమతులు రాలేదు.

ఫలితంగా శంకర్ విలాస్ బ్రిడ్జిని తొందరపడి కూల్చివేశారనే భావన ప్రజల్లో మొదలయ్యింది. అంతేకాదు శంకర్ విలాస్ పేరుతో జేఏసీ సైతం ఏర్పడింది. అధికారుల ఒంటెత్తు పోకడలకు వ్యతిరేకంగా జేఏసీ పోరాటం మొదలుపెట్టింది. మొదట్లో జేఏసీ సమావేశానికి వచ్చిన వైసీపీ తర్వాత సైలెంట్ అయిపోయింది. కొద్దిరోజులుగా ఆర్ఓబి నిర్మాణం పనులు నత్తనడకన కొనసాగుతుండడంతో మళ్లీ వైసీపీ రంగంలోకి దిగింది. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, మోదుగుల వేణుగోపాలరెడ్డితో పాటు ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్లు శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు....

ఏసీ కాలేజీవైపు, బ్రాడీపేట వైపు నిర్మాణాలను పరిశీలించారు. శంకర్ విలాస్ ఆర్ఓబిని ఏకపక్షంగా కూల్చివెయ్యడం వల్ల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అంహం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. అందరితో మాట్లాడి స్థలాలు కోల్పోయే బాధితులకు పరిహారం విషయంలో ఒప్పించి ముందుకెళితే ఈ సమస్య వచ్చేది కాదని ఆగ్రహించారు. కొత్త ఆర్ఓబి నిర్మాణానికి ఎవరూ వ్యతిరేకం కాదన్నారు. వచ్చిన 97కోట్ల నిధులతోనే నిర్మించాలన్న మొండివైఖరే అందరికీ ఇబ్బందిగా మారిందన్నారు. శంకర్ విలాస్ ఆర్ఓబి కూల్చివేత వ్యవహారంలో కేంద్రమంత్రి పెమ్మసాని, మేయర్ లు అత్యుత్సాహంతో ఈ పరిస్థితి వచ్చిందనే విమర్శలు పెరిగాయి.


సేతుబంధు కింద వచ్చిన నిధులతో ఆర్ఓబి నిర్మిస్తామనడం దుర్మార్గమంటున్నారు విపక్ష నేతలు. బ్రిడ్జిని కూలగొట్టడం వల్ల నగర ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఫైర్ అవుతున్నారు. అలా కాకుండా ప్రత్యామ్నాయంగా ఆర్.యు.బి. నిర్మాణం చేసి తర్వాత బ్రిడ్జిని కూల్చివేస్తే జనం ఇబ్బందులు పడేవారు కాదంటున్నారు. ఆర్ఓబి నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయని మండిపడ్డారు. వైసీపీ నేతలు వస్తున్నారని అరకొరగా పనులు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వాసుపత్రి, మెడికల్ కాలేజీ, కోర్టుకు వెళ్లేవారు అనేక అవస్థలు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైసీపీ నేతలు. ప్రస్తుతం జరుగుతున్న పనులు చూస్తే మరో ఇరవైఏళ్లు అయినా ఆర్ఓబి నిర్మాణం పూర్తవుతుందా అనే సందేహాలు పెరిగిపోతున్నాయి.


దీంతో ఇప్పుడు కేంద్రమంత్రి పెమ్మసానితో సహా టీడీపీ నేతలు ఢిఫెన్స్ లో పడిపోయారు. ఇమేజ్ కోసం వెళ్తే డామేజ్ బారినపడ్డామని ఆవేదన చెందుతున్నారు. మరి.. ఇప్పుడు ఈ నష్ట నివారణ కోసం ఏం చేస్తారనేది ఆసక్తిని పెంచుతోంది.

Tags:    

Similar News