బొత్స వర్సెస్‌ కోలగట్ల కోల్డ్‌వార్ ఎపిసోడ్‌లో లేటెస్ట్‌ ట్విస్టేంటి?

Update: 2019-07-04 15:50 GMT

కొత్త ప్రభుత్వం ఏర్పడి పట్టుమని నెలరోజులు కాక ముందే, ఆ జిల్లా అధికార పార్టీలో ఆధిపత్య పోరు మొదలైందట. ఒకరిపై మరొకరు పైచేయి సాధించడానికి ఎవరికి వారు స్కెచ్‌లు వేస్తున్నారట. అక్కడ ఏ చిన్న విషయమయినా తన దృష్టికి తేవాలని ఆ జిల్లా మంత్రి ఆర్డర్‌లు వేస్తుంటే, నగరంలో ఏం జరిగనా తన కనుసన్నల్లోనే జరగాలని మరో నేత అనుచరులకు హుకుం జారీ చేస్తున్నారట. దీంతో ఎవరి మాట వినాలో అర్థంకాక అటు అధికారులు, ఇటు కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారట. ఇంతకీ ఆధిపత్య పోరు మొదలైన జిల్లా ఏది ఏయే వర్గాల మధ్య ఈపోరు నడుస్తోందో తెలియాంటే, వాచ్‌దిస్ స్టోరి.

2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి కంచుకోటగా నిలిచింది విజయనగరం జిల్లా. జిల్లాలోని తొమ్మిదికి తొమ్మిది స్థానాలు గెలిచి క్లీన్ స్వీప్ చేసింది వైసీపీ. అయితే గెలిచామన్న ఆనందం ఆ నియోజకవర్గం కేడరులో కనిపించడంలేదట. టీడీపీకి కంచుకోటయిన విజయనగరం అసెంబ్లీ సెగ్మెంట్‌లో పూసపాటి గజపతిరాజుల ఆడపడుచు, అశోక్ గజపతిరాజు కూతురు అదితి గజపతిరాజుపై గెలుపొందారు వైసీపీ ఉత్తరాంధ్ర కన్వినర్ కోలగట్ల వీరభద్ర స్వామి. ఇక ఇక్కడే అసలు సమస్య మొదలైంది.

విజయనగరం జిల్లాలో బలమైన నేతగా ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ, విజయనగరం ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి వర్గాల మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరిందన్న టాక్ వైసీపీ కేడర్‌ని కలవరపెడుతోంది. 2014లో కాంగ్రెస్ నుంచి ముందుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కోలగట్ల వీరభ్రదస్వామి, తానే ఆ పార్టీకి తిరుగులేని నాయకుడినని అనుకుంటున్న సందర్భంలో, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడా వైసీపీలో చేరడంతో సమస్య మొదలైంది. బొత్స-కోలగట్ల మధ్య అప్పటి నుంచి చాపకింద నీరులా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. వారి విభేదాలు గతంలో కొన్నిసార్లు బహిర్గతమైన సందర్భాలూ ఉన్నాయి. దీంతో ఎవరి శిబిరాన్ని వారే నిర్వహించుకుంటూ వస్తున్నారు.

తాజాగా జగన్ ప్రభుత్వంలో బొత్స సత్యనారాయణకి మంత్రి పదవి దక్కింది. కోలగట్లకు గతంలో మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చినా, చివరి నిమిషంలో ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు. అంతేకాక అందరికీ తగిన ప్రాధాన్యత ఇస్తూ కలిసి పనిచేసుకోవాలంటూ కోలగట్లకు సూచనలు చేసారట జగన్. దీంతో కోలగట్ల తన నియోజకవర్గంపై ఎవరైనా జోక్యం చేసుకుంటే కుదిరేదిలేదని బహిరంగంగానే కార్యకర్తలకు ఆదేశించారట. అదే సమయంలో బొత్స వర్గం కూడా విజయనగరంలో ఏం జరిగినా తమ దృష్టికి రావాలని ఆదేశించారట. దీంతో బొత్సా-కోలగట్ల వర్గీయులు జిల్లా కేంద్రంపై పట్టు కోసం ఢీ అంటే ఢీ అని అంటున్నారట. వీరద్దిరి పంతాలతో అధికారులు సైతం టెన్షన్ పడుతున్నారట.

వైసీపీ అధికారంలో లేనపుడు ఇరువర్గాలు ఒకే జెండా, వేరు వేరు అజెండాలతో ముందుకు పోయేవారు. దీనిపై పార్టీ పెద్దల వద్ద పలుమార్లు పంచాయితీ పెట్టినా ఇరువర్గాల తీరు మారలేదు. ఒకానొక సమయంలో ఒకరినొకరు ఓడించుకునేందుకు సైతం స్కెచ్‌లు గీసుకున్నారన్న ప్రచారమూ జోరుగా సాగింది. జగన్ ప్రభంజనంతో ఇరువురు నేతలు గెలవడంతో వారి వర్గాలు సైతం కొంత సైలెంటుగా ఉన్నా తాజాగా బొత్సకి మున్సిపల్ శాఖ ఇవ్వడంతో మరోసారి అధిపత్యపోరు రాజుకుంది. విజయనగరం నియోజకవర్గంలో వేలుపెట్టొద్దంటూ బొత్స వర్గంవారిని, కోలగట్ల వర్గం వాదిస్తుంటే, తమ నేత మున్సిపల్ మంత్రి అంటూ, విజయనగరం కార్పొరేషన్‌లో జరిగే పనులుపై ఆరా తీసే హక్కు తమకుందంటూ వాదిస్తున్నారట బొత్స అనుచరులు.

తాజాగా జరగిన జిల్లా అభివృద్ది సమీక్షలో సైతం, కోలగట్ల వీరభద్ర స్వామి, బొత్స వర్గానికి ఘాటైన హెచ్చరిక కూడా చేశారు. ఎవరైనా తనకి తెలియకుండా పనులు చేస్తామని, పథకాలు ఇప్పిస్తామని ప్రజలవద్దకు వెళితే, సొంత పార్టీ వారినైనా సరే అరెస్ట్ చేయాలని అధికారులకు సైతం ఆదేశాలు జారీ చేస్తానని, పరోక్షంగా బొత్స వర్గానికి విజయనగరం పట్టణ వ్యవహారాల్లో వేలుపెట్టొద్దంటూ హెచ్చరికలు చేసినట్టైంది కోలగట్ల.

మరోవైపు వచ్చే మున్సిపల్ ఎన్నికల నుంచి విజయనగం కార్పొరేషన్‌గా మారుతుండటంతో మేయిర్ పదవిని ఎలాగైనా సాధించాలని బొత్స వర్గం ఇప్పటి నుంచే స్కెచ్ వేస్తోందని తెలుస్తోంది. మేయర్ తమ వారైతే విజయనగరం పట్టణం తమ ఆధీనంలోనే ఉంటుందని, కోలగట్ల దూకుడికి కళ్లెం వేయొచ్చనే భావనలో బొత్స వర్గం ఉన్నట్టు సమాచారం. అటు కోలగట్ల సైతం తన కుమార్తెను విజయనగరం మొదటి మేయర్‌గా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారట. కొన్నేళ్లుగా జరుగుతున్న ఆధిపత్యపోరు సమస్యని పరిష్కరించడంలో వైసీపీ అధినాయకత్వం కూడా విఫలమవ్వడంతో వైసీపీ క్యాడర్ ఎటువైపు వెళ్లాలో తెలియక అయోమయంలో ఉందట. పార్టీ అధికారంలోకి వచ్చినా నాయకుల తీరు మారకపోవడంతో, గెలిచిన ఉత్సాహం నీరుగారిపోయిందని కార్యకర్తలు డీలాపడిపోతున్నారు. ఇలాగే కొనసాగితే భవిష్యత్ ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారట వైసీీపీ నేతలు. 

Full View

Tags:    

Similar News