Botsa Anush: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కొత్త చర్చ.. బొత్స అనూష ఎంట్రీతో ఊపందుకున్న రాజకీయాలు

Botsa Anush: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు డాక్టర్ బొత్స అనూష.

Update: 2026-01-01 07:52 GMT

Botsa Anush: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కొత్త చర్చ.. బొత్స అనూష ఎంట్రీతో ఊపందుకున్న రాజకీయాలు

Botsa Anush: ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ప్రస్తుతం ఎక్కువగా వినిపిస్తున్న పేరు డాక్టర్ బొత్స అనూష. సీనియర్ నేత, వైయస్ఆర్ సీపీ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుమార్తెగా ఇప్పటికే గుర్తింపు ఉన్న అనూష, ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ రాజకీయంగా తనదైన ముద్ర వేస్తున్నారు.

బొత్స సత్యనారాయణ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పీసీసీ అధ్యక్షుడిగా, ఆ తర్వాత వైయస్ఆర్ సీపీలో కీలక నేతగా తన రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. విజయనగరం జిల్లాలో తన పట్టును నిలుపుకుంటూ వస్తున్న ఆయన, ప్రస్తుతం మండలిలో ప్రతిపక్ష నేతగా ప్రభుత్వంపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వారసులను రాజకీయ రంగంలోకి తీసుకురావాలని భావిస్తున్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇప్పటికే ఆయన కుమారుడు బొత్స సందీప్ సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు దగ్గరవుతుండగా, కుమార్తె బొత్స అనూష ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో ముందుండి పాల్గొంటున్నారు. ముఖ్యంగా ఇటీవల వైయస్ఆర్ సీపీ అధినేత జగన్ పుట్టినరోజు సందర్భంగా చీపురుపల్లి నియోజకవర్గంలో నిర్వహించిన భారీ కార్యక్రమాలన్నింటినీ అనూషే స్వయంగా పర్యవేక్షించడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

రక్తదానం, అన్నదానం, సేవా కార్యక్రమాలు భారీ స్థాయిలో జరగడం, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొనడం పార్టీ అధిష్టానం దృష్టిని కూడా ఆకర్షించిందని తెలుస్తోంది. దీంతో చీపురుపల్లి నియోజకవర్గంలో పార్టీని యాక్టివ్ చేయడంలో బొత్స అనూష కీలక పాత్ర పోషిస్తున్నారన్న అభిప్రాయం బలపడుతోంది.

ఇటీవల మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని కూడా అనూష స్వయంగా పర్యవేక్షించారు. దాదాపు 70 వేల సంతకాలు సేకరించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ఆమె సక్సెస్ అయ్యారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. స్వతహాగా వైద్యురాలు కావడం ఈ ఉద్యమానికి అదనపు బలం ఇచ్చిందని అంటున్నారు.

ఈ పరిణామాల నేపథ్యంలో బొత్స అనూష త్వరలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగబోతున్నారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా ఆమె పోటీ చేసే అవకాశం ఉందన్న టాక్ పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. బొత్స కుటుంబంలో గతంలో కూడా ఈ తరహా రాజకీయ ప్రయాణం ఉండటంతో, అనూష రాజకీయ అరంగేట్రం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Tags:    

Similar News