టీడీపీ నుంచి ఆ కీలకనేత జంపా?

Update: 2019-04-03 13:17 GMT

ఎన్నికల తేదీ దగ్గరపడుతుండటంతో బలమైన నేతలను వైసీపీ తమ పార్టీలో చేర్చుకుంటోంది. ఇందులో భాగంగా నంద్యాల మాజీ ఎంపీ గంగుల ప్రతాప్ రెడ్డిని తమవైపు వస్తారని ఆశిస్తోంది. నంద్యాల ఉపఎన్నికల సమయంలో గంగుల ప్రతాపరెడ్డి టీడీపీలో చేరారు. ఆయనకు ఆ సమయంలో నంద్యాల పార్లమెంటు టిక్కెట్ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే నంద్యాల సీటును ఆయనకు కాకుండా మాండ్ర శివానందరెడ్డికి కేటాయించారు చంద్రబాబు. దీంతో గంగుల అసంతృప్తితో ఉన్నారు. తనకు సీటు ఇవ్వకుండా షాక్ ఇచ్చిన అధిష్టానానికి ఆయన ఝలక్ ఇచ్చేందుకు రెడీ అయ్యారు. మంగళవారం ఆయన తమ్ముడు కుమారుడు ఆళ్లగడ్డ వైసీపీ అభ్యర్థి గంగుల బిజేంద్రరెడ్డి.. ప్రతాప్ రెడ్డిని కలిశారు.

దీంతో ఆళ్లగడ్డలో బిజేంద్రకు తన మద్దతు ఉంటుందని ప్రకటించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని గంగుల వర్గీయులు, ప్రజలు కలిసి బిజేంద్రారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు తనను సాయం అడిగినందున ఆ పార్టీ అభ్యర్థి కోసం పనిచేశానని కానీ తనను కాదని వేరే వాళ్లకు టిక్కెట్ ఇచ్చారని మండిపడ్డారు. ఈ మాటలతో ఆయన జగన్ కు జై కొడతారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. రేపు లేదా ఎల్లుండి ఆయన వైసీపీలో చేరడం ఖాయమని అంటున్నారు. ఒకవేళ ఆయన పార్టీ మారితే మంత్రి అఖిలప్రియకు రాజకీయంగా దెబ్బె అని అంటున్నారు.

Similar News