నెల్లూరు జిల్లా ఎస్పీగా భాస్కర్ భూషణ్ నియామకం
జిల్లా ఎస్పీగా భాస్కర్ భూషణ్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఉత్వర్వులు వెలువడ్డాయి.
నెల్లూరు: జిల్లా ఎస్పీగా భాస్కర్ భూషణ్ నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఉత్వర్వులు వెలువడ్డాయి. ప్రస్తుతం జిల్లా ఎస్పీగా పనిచేస్తున్న ఐశ్వర్య రస్తోగిని మంగళగిరి ఏఐజీ అడ్మిన్‌గా బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2009 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన భూషణ్ ఆంధ్రా కేడర్‌కు చెందిన వారు. బీహార్ రాష్ట్రం ధర్మాంగ జిల్లా క్యూటీలో జన్మించారు.
రాంచీలో విద్యాభ్యాసం కొనసాగగా ఖరగ్‌పూర్ ఐఐఐటీలో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఇంజినీర్‌గా చెన్నై, సింగపూర్, మనీలాలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ సివిల్స్ రాసి 2009లో ఐపీఎస్ అధికారిగా పోలీసు శాఖలో ప్రవేశించారు. కరీంనగర్‌లో శిక్షణ పొందిన ఆయన.. ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఓఎస్డీగా విధులు నిర్వర్తించారు. అనంతరం 2015 వరకు ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో అదనపు ఎస్పీగా పనిచేశారు.
రాష్ట్ర విభజనతో ఆయన్ను ఆంధ్రా కేడర్‌కు కేటాయించగా, పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా 2015 మార్చిలో బాధ్యతలు స్వీకరించారు. సుమారు రెండేళ్లు పాటు ఆయన అక్కడ విధులు నిర్వర్తించగా పాలనలో తమదైన ముద్ర వేసుకున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సిబ్బందికి చేరువ చేయడంతో పాటు అనేక కీలక కేసుల పరిష్కారానికి కృషి చేశారు.