ఒత్తిళ్లున్నాయి కానీ,.... : వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అయోధ్య రాంరెడ్డి
Ayodhya Ramireddy: తాను పార్టీ మారడం లేదని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అయోధ్య రాంరెడ్డి స్పష్టం చేశారు.
Ayodhya Rami Reddy: తాను పార్టీ మారడం లేదని వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అయోధ్య రాంరెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాల్లో ఒత్తిళ్లు సహజమని వాటిని తట్టుకొని నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలుంటాయి. పార్టీ అధికారానికి దూరమైన సందర్భంలో తట్టుకోవాలని ఆయన అన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలు పార్టీ మారాలని ఒత్తిడి ఉందని ఆయన మీడియాకు చెప్పారు. విజయసాయిరెడ్డితో పాటు తాను కూడా పార్టీ మారుతానని జరిగిన ప్రచారాన్ని ఖండించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
విజయసాయిరెడ్డి కష్టపడే వ్యక్తి, బాధ్యతగల వ్యక్తి అలాంటి వ్యక్తి పార్టీ మారడానికి కారణం ఏదో ఉండి ఉంటుందన్నారు. పార్టీ మారడానికి గల కారణాలను విజయసాయిరెడ్డి చెప్పారని ఆయన గుర్తు చేశారు. రాజకీయ నేపథ్యం నుంచి వచ్చినవారికి ఒత్తిళ్ల గురించి తెలుసు. ఇతర రంగాల నుంచి వచ్చినవారికి ఒత్తిళ్ల గురించి తెలియకపోవచ్చన్నారు. కొన్ని సమయాల్లో వంద మార్కులు వస్తే మరికొన్ని సమయాల్లో సున్నా మార్కులు వస్తాయన్నారు. వ్యవస్థలో నెంబర్ గేమ్ ఉంది. అందుకే ఒత్తిళ్లు ఉంటాయని ఆయన అన్నారు. ఈ ఒత్తిళ్లను బ్యాలెన్స్ చేసుకోవాలని అయోధ్య రాంరెడ్డి సూచించారు. అధికారంలోకి వచ్చినప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఓటి సమయంలో మరో రకంగా ఉంటుందని ఆయన అన్నారు. కుటుంబం, వ్యక్తిగత సమస్యలను బ్యాలెన్స్ చేసుకొన్న తర్వాత రాజకీయాల్లోకి రావాలని ఆయన రాజకీయ నాయకులకు సూచించారు.తమ పార్టీ అన్నీ సరిగా చేసి ఉంటే ఎన్నికల్లో గెలిచేవాళ్లమని ఆయన అన్నారు. కొన్ని ఇబ్బందులు, పొరపాట్లు జరిగి ఉన్నాయన్నారు.