Scrub Typhus In AP: వామ్మో.. ఏపీలో భారీగా పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు.. 22 మంది మ్రుతి..!!
Scrub Typhus In AP: వామ్మో.. ఏపీలో భారీగా పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ కేసులు.. 22 మంది మ్రుతి..!!
Scrub Typhus In AP: ఏపీలో స్క్రబ్ టైఫస్ కేసులు క్రమంగా పెరుగుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2 వేలకుపైగా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు అయ్యాయి. ఈ వ్యాధి కారణంగా 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు వైద్య శాఖ వెల్లడించింది. ముఖ్యంగా గత మూడేళ్లుగా చిత్తూరు జిల్లా ఈ వ్యాధికి హాట్‌స్పాట్‌గా మారిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుత ఏడాదిలోనే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 491 కేసులు నమోదు కావడం గమనార్హం. దీనివల్ల జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
చిత్తూరు తరువాత కాకినాడ, విశాఖపట్నం జిల్లాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వర్షాకాలం అనంతరం పచ్చిక పెరుగుదల, పొలాల్లో పనులు పెరగడం, ఎలుకల సంచారం ఎక్కువ కావడం వంటి కారణాలతో ఈ వ్యాధి వ్యాప్తి అధికమవుతున్నట్లు నిపుణులు వివరిస్తున్నారు. స్క్రబ్ టైఫస్ అనేది మైట్స్ ద్వారా వ్యాపించే బ్యాక్టీరియా సంక్రమణ. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారు, రైతులు, వ్యవసాయ కూలీలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
ఈ వ్యాధి లక్షణాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. జ్వరం, తీవ్రమైన తలనొప్పి, శరీర నొప్పులు, వాంతులు వంటి లక్షణాలతో పాటు శరీరంపై ఎక్కడైనా నల్లని మచ్చ (ఎస్కార్) కనిపిస్తే వెంటనే సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రిని సంప్రదించాలని హెచ్చరిస్తున్నారు. ప్రారంభ దశలో గుర్తించి సరైన యాంటీబయాటిక్స్‌తో చికిత్స అందిస్తే స్క్రబ్ టైఫస్ పూర్తిగా నయం అయ్యే అవకాశం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అయితే ఆలస్యం చేస్తే ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు, వైద్య శిబిరాలు నిర్వహిస్తూ కేసులను తొందరగా గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ప్రజలు భయపడకుండా, లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య సహాయం పొందాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు