ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యాపార అనుకూల రాష్ట్రంగా (Business-Friendly State) నిలిచిందని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ కొనియాడారు. విశాఖపట్నంలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సులో (CII Partnership Summit) ఆయన ముఖ్య అతిథిగా ప్రసంగించారు.
రాష్ట్రంలో ప్రశాంతమైన వాతావరణం నెలకొని ఉందని ఉపరాష్ట్రపతి చెప్పారు. దేశంలో పేదరికం తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు.
కార్మిక చట్టాలు, పన్నుల విధానంలో కేంద్రం అనేక సంస్కరణలు తీసుకొచ్చిందని, ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో గడిచిన 11 ఏళ్లుగా దేశం స్థిరంగా ముందుకు వెళ్తోందని ఆయన పేర్కొన్నారు. "సరైన సమయంలో సరైన ఆలోచనే విజయానికి పునాది" అని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో రాష్ట్రానికి అనేక పెట్టుబడులు వచ్చాయని ఉపరాష్ట్రపతి ప్రశంసించారు. "మూడు దశాబ్దాలుగా చంద్రబాబు నాకు స్నేహితుడు" అని ఆయన అన్నారు.
"పెట్టుబడిదారులను ఆకర్షించే విషయంలో చంద్రబాబు ముందుంటారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్లే ప్రపంచ నలుమూలల నుంచి వచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నారు" అని సీపీ రాధాకృష్ణన్ స్పష్టం చేశారు.
ఏపీలో ఉన్న ఈ అనుకూల వాతావరణాన్ని వినియోగించుకోవాలని ఆయన అంతర్జాతీయ పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు.