Chandrababu: పోలీసు అంటే.. నేరస్తులకు భయం పుట్టించాలి
Chandrababu: ప్రజల రక్షణ కోసం ముందుండేది పోలీసులేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు.
Chandrababu: పోలీసు అంటే.. నేరస్తులకు భయం పుట్టించాలి
Chandrababu: ప్రజల రక్షణ కోసం ముందుండేది పోలీసులేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. విధి నిర్వహణ కారణంగా తమ కుటుంబంతో సరిగా గడపలేని పరిస్థితి వారిదని చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని 6వ బెటాలియన్‌లో పోలీసు అమరవీరుల సంస్మరణ దినం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
సమాజంలో అశాంతి సృష్టించడానికి రాజకీయ ముసుగులో కొత్త నేరాలు చేస్తున్నారన్నారు. రాజకీయ కుట్ర, ఫేక్ ప్రచారాలు చేస్తున్నారన్నారని ఆయన మండిపడ్డారు. కుల, మతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం.. నేరస్థులపై కఠినంగా ఉండాలి.. శాంతి భద్రతల విషయంలో రాజీ పడవద్దని చెప్పానన్నారు. క్రిమినల్స్ సైబర్ టెక్నాలజీలో అప్డేట్ అవుతున్నారు.. వారి కంటే ముందుండకపోతే నేరాలను కట్టడి చేయలేమని అన్నారు. నేరరహిత సమాజం కోసం అందరూ పనిచేయాల్సిన అవసరముందని గుర్తుచేశారు. సాంకేతికంగా పోలీసు శాఖను బలోపేతం చేస్తున్నామని అన్నారు. ఈగల్, శక్తి బృందాల ఏర్పాటుతో రాష్ట్ర పోలీసు వ్యవస్థ ఆదర్శంగా నిలిచిందన్నారు. డ్రగ్స్, గంజాయి స్థావరాలను గుర్తించి ధ్వంసం చేస్తున్నామని పేర్కొన్నారు.