వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్‌ .. ఏకగ్రీవం అయ్యే ఛాన్స్

శాసన మండలిలో తన బలాన్ని పెంచుకునే దిశగా వైసీపీ తొలి అడుగు వేయబోతోంది.

Update: 2020-06-25 02:46 GMT
Dokka Manikya Vara Prasad (File Photo)

శాసన మండలిలో తన బలాన్ని పెంచుకునే దిశగా వైసీపీ తొలి అడుగు వేయబోతోంది. ఈ మేరకు ఎమ్మెల్యే కోటాలో జరగనున్న శాసనమండలి ఉపఎన్నికలకు వైసీపీ అభ్యర్థిగా డొక్కా మాణిక్య వరప్రసాద్‌ పేరును అధిష్టానం ఖరారు చేసింది. మండలి ఉపఎన్నికల్లో నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి గురువారం చివరిరోజు. దీంతో వైసీపీ అభ్యర్థిగా డొక్కా గురువారం ఉదయం నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఆయన్ను ప్రతిపాదిస్తూ వైసీపీ 10మంది ఎమ్మెల్యేల సంతకాలు చేశారు. నామినేషన్‌ ప్రక్రియకు వైసీపీ అన్ని ఏర్పాట్లు చేసింది. మాణిక్య వరప్రసాద్ కాస్సేపట్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నారు.

ఈ ఉపఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడంలేదు. ఆ పార్టీకి శాసనసభలో తగిన బలం లేకపోవడమే దీనికి కారణం. ఆ పార్టీ నుంచి మరెవరూ నామినేషన్ పత్రాలను దాఖలు చేయకపోతే- డొక్కా ఎన్నిక ఏకగ్రీవం కానుంది. డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరడంతో ఆ స్థానానికి ఖాళీ ఏర్పడింది. కాగా అయిన స్థానాన్ని ఆయనతోనే భర్తీ కాబోతోంది. ఒక్క స్థానమే ఖాళీ కావడం, అభ్యర్థిని గెలిపించుకునేంతటి బలం లేకపోవడంతో టీడీపీ నామినేషన్ల ప్రక్రియకు దూరంగా ఉంది.

డొక్కా మాణిక్య వరప్రసాద్ మరో మూడేళ్ల పాటు శాసనమండలిలో సభ్యునిగా ఉంటారు. 2023 మార్చి 29వ తేదీన ఆయన పదవీ కాలం ముగుస్తుంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం.. గురువారం నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ కాగా.. శుక్రవారం నామినేషన్ల స్క్రూటినీ ఉంటుంది. 29 వరకు నామినేషన్లు విత్ డ్రా.. జులై 6న పోలింగ్ నిర్వహిస్తారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు కొనసాగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లను లెక్కిస్తారు. ఒకే నామినేషన్ దాఖలైతే ఆయన ఎన్నిక ఏకగ్రీవం అవుతుంది. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామనే నిర్ణయాన్ని టీడీపీ వ్యతిరేకించడాన్ని నిరసిస్తూ ఆయన ఆ పార్టీకి గుడ్‌బై చెప్పినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అనంతరం డొక్కా మాణిక్యవరప్రసాద్ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.

కీలక బిల్లులు ఆమోదం విషయంలో అసెంబ్లీలో నెగ్గినప్పటికి శాసన మండలిలో ప్రతిపక్ష టీడీపీ నుంచి ఇబ్బందులు తప్పడంలేదు. డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎన్నికతో వైసీపీ ఇక ముందు నిర్వహించబోయే మండలి ఎన్నికలు ఏకపక్షంగా మార్చుకోబోతోంది.


Tags:    

Similar News