Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల వార్తలు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల వారిగా తాజా వార్తలు

Update: 2021-07-05 01:51 GMT

ఆంధ్రప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

కడప:

కడప, చిత్తూరు జిల్లాలో ప్రతి గ్రామానికీ తాగు సాగు నీరు అందించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి లక్ష్యమన్నారు ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి. కడప జిల్లా చక్రాయపేట మండలం తక్కళ్లపల్లె డ్యామ్ దగ్గర ఎత్తిపోతల పథకం పనులకు శ్రీకారం చుట్టారు. సుమారు 5వేల కోట్ల రూపాయలతో చేపడుతోన్న పనులకు భూమిపూజ నిర్వహించారు. ఈ భూమిపూజ కార్యక్రమానికి రైతులు పెద్దఎత్తున హాజరయ్యారు.

విజయనగరం జిల్లా:

విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం కొండకింగువ గ్రామంలో బొబ్బిలి ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడును గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇళ్ల స్థలాలు, ఫించన్లు మంజూరులో అవకతవకలు జరిగాయంటూ ఆందోళనకు దిగారు. పరిస్థితిని అదుపు చేయడానికి గ్రామస్తులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దాంతో, ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన్నప్పలనాయుడు కారు దిగకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.

అనంతపురం జిల్లా:

అనంతపురం జిల్లా రాయదుర్గంలో జులై 8న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గోనున్నారు. దాంతో, సీఎం జగన్ పర్యటన కోసం అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. రాయదుర్గంలో చేస్తున్న ఏర్పాట్లను కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సత్యయేసుబాబు పరిశీలించారు.

చిత్తూరు:

చిత్తూరు రైతులను గజరాజులు బెంబేలెత్తిస్తున్నాయి. ఆరుగాలం కష్టపడిన రైతన్నలకు పంట చేతికందకుండా చేస్తున్నాయి. ఏకంగా 14 ఏనుగులు ఒక్కసారిగా పంట పొలాలపై స్వైర విహారం చేశాయి. నాగిరెడ్డిపల్లికి చెందిన రైతు సోమశేఖర్‌కు చెందిన అరటి తోటలో ప్రవేశించిన ఏనుగుల గుంపు.. 12వందల అరటి మొక్కలను ధ్వంసం చేశాయి. ఏనుగుల దాడితో దాదాపు 3లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని కన్నీటి పర్యంతం అయ్యారు.

సింహాచలం:

సింహాచలం ఆలయ ప్రతిష్టకు భంగం కలిగేలా వీడియో మార్ఫింగ్‌ చేసిన నిందితులను గుర్తించి వివరణ తీసుకున్నారు. సుబ్రహ్మణ్యశర్మ, గొడవర్తి శ్రీనివాసాచార్యులు వీడియోను మార్ఫింగ్‌ చేసినట్లు నిందితులు అంగీకరించారు. ఈ ఘటనపై కమిషనర్‌కు ఫిర్యాదు చేశామని ఆలయ ఈవో సూర్యకళ వెల్లడించారు. మరోవైపు ఆలయ భూములపై జాయింట్‌ కలెక్టర్‌ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుందన్నారు.

విశాఖ:

విశాఖ ఎన్‌ఏడీ జంక్షన్‌ దగ్గర తృటిలో ప్రమాదం తప్పింది. ఫ్లైఓవర్‌పై ఓ ఫార్మా కంపెనీ బస్సు అదుపుతప్పింది. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది.

నెల్లూరు జిల్లా:

నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టడంతో నలుగురు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. రాజమండ్రి వాసులు తిరుపతికి వెళ్లి తిరిగి కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Tags:    

Similar News