వైసీపీ ఏకగ్రీవాల లెక్క చూస్తే..

Update: 2020-03-14 04:45 GMT

ఏపీలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏకగ్రీవాలకు ప్రయత్నించి మంచి ఫలితాలను రాబట్టింది. ఇప్పటివరకు 24 జెడ్పీటీసీలు, 563 ఎంపీటీసీలు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి.. అలాగే రాష్ట్రవ్యాప్తంగా 93 వార్డులు ఏకగ్రీవంగా గెలుచుకున్నాయి. అత్యధికంగా గుంటూరు జిల్లా మాచెర్ల నియోజకవర్గంలో 71 ఎంపీటీసీలకు గాను ఆ పార్టీ 65 ఎంపీటీసీలు వైసీపీ హస్తగతం చేసుకుంది. అంతేకాదు మాచెర్ల మున్సిపాలిటీని కూడా ఏకగ్రీవంగా గెలుచుకుంది. ఇక్కడ 31 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు మినహా ఎవరూ నామినేషన్ వేయలేదు. అయితే ఐదు వార్డుల్లో మాత్రం నామినేషన్లు దాఖలు అయ్యాయి.

టీడీపీ నేతలు బోండా ఉమా, బుద్ధా వెంకన్న కారు అద్దాలు పగులగొట్టిన తురక కిషోర్ వైసీపీ తరుపున 32వ వార్డులో నామినేషన్ వేశారు. మరోవైపు అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీ కూడా వైసీపీ చేజిక్కించుకుంది. ఇక్కడ కూడా వైసీపీ అభ్యర్థులే ఎక్కువగా నామినేషన్ వేశారు. నరసరావుపేట నియోజకవర్గంలో 6 చోట్ల ఒకటే నామినేషన్ దాఖలైంది. దాంతో ఇక్కడ కూడా ఆరు ఎంపీటీసీలు వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పలు మండలాల్లో వైసీపీ అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేశారు.

ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి చేతులెత్తేశారు.. గిద్దలూరు, దర్శి , కనిగిరి నియోజకవర్గాల్లో భారీగా ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో 6 చోట్ల ఎంపీటీసీలు ఏకగ్రీవమైతే.. శ్రీకాకుళంలో 2 చోట్ల వైసీపీకి ఏకగ్రీవం అయ్యాయి. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకటరావు సొంత ఇలాకాలో ఎదురుదెబ్బ తగిలింది. రాజాం నియోజకవర్గం రేగిడి ఆమోదాలవలసలో 3 , సంతకవిటి మండలంలో 2 ఎంపీటీసీ లు ఏకగ్రీవం అయ్యాయి. పలాస నియోజకవర్గంలోని వజ్రపుకొత్తూరు మండలంలో 3 ఎంపీటీసీలు, ఎచ్చెర్ల నియోజకవర్గంలో 1 ఎంపీటీసీ ఏకగ్రీవం అయ్యాయి.

ఇక పాలకొండ నియోజకవర్గం వీరఘట్టంలో ఒకటే నామినేషన్ వచ్చినట్టు ఈసీ తెలియజేసింది. కాగా కర్నూల్ జిల్లా డోన్, చిత్తూరు జిల్లా పుంగనూరు మున్సిపాలిటీలు కూడా వైసీపీ ఖాతాలో చేరనున్నాయి. పుంగనూరులో 31 వార్డులకు గాను 14 చోట్ల వైసీపీ అభ్యర్థులే నామినేషన్లు వేశారు.. డోన్ లో 32 వార్డులుంటే 12 చోట్ల మాత్రమే టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. డోన్, పుంగనూరు మున్సిపాలిటీల్లో టీడీపీ చేతులెత్తేసింది. ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించింది.  

Tags:    

Similar News