తోటపల్లి దేవాలయం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఉపముఖ్యమంత్రి

Update: 2020-06-10 09:33 GMT
Deputy Chief Minister Pushpa Srivani laid the foundation stone

గరుగుబిల్లి: మండలంలోని తోటపల్లిలో వెలసిన శ్రీవేంకటేశ్వర, కోదండరామస్వామి దేవాలయ జీర్ణోద్ధరణ, అభివృద్ధి పనులకు బుధవారం డిప్యుటీ సిఎం పుష్ప శ్రీవాణి, వైసీపీ అరకు పార్లమెంటరీ అధ్యక్షులు శత్రచర్ల పరీక్షిత్ రాజు దంపతులు శంకుస్థాపన చేశారు. ఈ నేపథ్యంలోనే ఆలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో ఉప ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగానే పుష్ప శ్రీవాణి మాట్లాడుతూ, విజయనగరం జిల్లాలో ఎంతో ప్రసిద్ధి చెందిన తోటపల్లి ఆలయం తన సొంత నియోజకవర్గంలో ఉండటం అదృష్టమన్నారు.

ఈ ఆలయాన్ని రెండు దశల్లో పూర్తిగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. మొదటిదశలో గర్భాలయం, అర్ధమండపం, శ్రీదేవీ భూదేవి ఉపాలయాలు, ముఖమండపం, శ్రీకోదండరామ స్వామి ఆలయ జీర్ణోద్ధరణ తదితర పనులను రూ.1.20 కోట్లతో చేపట్టనున్నామని వివరించారు. తొలి విడుత నిధులు ఇప్పటికే విడుదలయ్యాయని చెప్పారు. రెండవ దశలో ఆలయ అభివృద్ధి పనులకు మొత్తం రూ.4.30 కోట్లను వెచ్చించనున్నామని తెలిపారు.

ఉత్తరాంధ్ర తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తోటపల్లి ఆలయాన్ని గత టీడీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ఆలయ గోపురం, మండపం బీటలువారినా పట్టించుకోలేదని విమర్శించారు. తమ హయాంలో ఆలయాన్ని అభివృద్ధి చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటుగా భక్తులకు అవసరమైన రవాణా, వసతి సౌకర్యాలను కూడా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇఓ బిఎల్ నగేష్, దేవాదాయశాఖ డిఇఇ సైదా, వైసీపీ మండల పార్టీ కన్వీనర్ ఉరిటి రామారావు పాల్గొన్నారు.  

Tags:    

Similar News