Andhra Pradesh Cabinet expansion: పదవులు రెండు..ఆశావహులు మెండు.. ఏపీ కేబినెట్‌లో బెర్త్‌లు ఎవరికి?

Update: 2020-06-25 11:35 GMT

పదవులు రెండు...ఆశావహులు మెండు. ఎవరికి వారు ప్రయత్నాలతో ట్రయల్స్‌ ట్రెండు. ఆంధ్రప్రదేశ్‌లో పిల్లి సుభాష్‌, మోపిదేవిలు ఖాళీ చేస్తున్న రెండు బెర్త్‌ల (Andhra Pradesh cabinet expansion) కోసం, పోటీ మామూలుగా లేదు. ప్రాంతాలు, సామాజికవర్గాలు, సన్నిహితాలు, విధేయతలు, ఇలా రకరకాల ప్యారామీటర్స్‌లో, అధిష్టానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఎమ్మెల్యేలు. మరి రెండు పదవులపై, ఎవరికి అవకాశాలు మెండు?

ఆంధ్రప్రదేశ్‌లో పిల్లి సుభాష్, మోపిదేవి వెంకటరమణలు రాజ్యసభకు ఎన్నిక కావడంతో రెండు కేబినెట్‌ బెర్త్‌లు ఖాళీ అవుతున్నాయి. ఈ రెండు పదవులపై బోలెడంతమంది ఆశలు పెట్టుకున్నారు. జిల్లావారీగా, ఎవరికివారే జోరుగా లాబీయింగ్ చేయడం మొదలుపెట్టారు. అనంతపురం జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీకి తిరుగులేని ఆధిక్యం కట్టిపెట్టారు ఓటర్లు. మొత్తం 14 నియోజకవర్గాల్లో, 12 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులతో పాటు రెండు ఎంపీ స్థానాల్లోనూ వైసీపీ అభ్యర్థులను గెలిపించారు. అయితే, మంత్రి వర్గంలో కేవలం పెనుకొండ శాసన సభ్యుడు శంకర నారాయణకు మాత్రమే స్థానం కల్పించారు. అదీ అంతగా ప్రాధాన్యంలేని బీసీ శాఖను కేటాయించడంపై జిల్లాలో ముందు నుంచి పార్టీలో కొంత అసంతృప్తి నెలకొంది. కనీసం రెండు మంత్రి పదవులతో పాటు ఇతర పదవులు వరిస్థాయని ముందు నుంచి నేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈసారైనా జిల్లాకు న్యాయం చేస్తారన్న ఆశతో ఉన్నారు. ఖాళీ కాబోతున్న రెండు మంత్రి పదవులు అనంతపురం జిల్లా వరకూ వస్తాయో లేక ఆయా జిల్లాల్లో ఉన్న వారితోనే భర్తీ చేస్తారా అన్న చర్చ జరుగుతోంది. (ఏపీ కేబినెట్‌ పలు కీలక నిర్ణయాలు)

అనంత జిల్లా నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న వారిలో అనంత వెంకట్రామిరెడ్డి, ప్రకాష్ రెడ్డి, కాపు రామచంద్రారెడ్డి, ఉషశ్రీ చరణ్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, ఎస్సీ కోటాలో జొన్నలగడ్డ పద్మావతిలు ప్రయత్నాల్లో వున్నారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఆశావహులు భారీగానే వున్నారు. జిల్లా నుంచి సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావుతో పాటు రాజాం శాసన సభ్యుడు కంబాల జోగులు,పాలకొండ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి,పలాస శాసన సభ్యుడు సీదిరి అప్పలరాజు పేర్లు ఆశావహుల లిస్టులో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుంటే, మాజీమంత్రి, టిడిపి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అరెస్టు వ్యవహారంతో, ఆ సామాజిక వర్గంలో కొంత అసంతృప్తి నెలకొందనే వాదన వినిపిస్తోంది.. ఈ నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన అధికార పార్టీ నేతకి మంత్రి వర్గంలో చోటు కల్పించడం ద్వారా, జిల్లాలో పార్టీని మరింత పటిష్టం చేయాలనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లుగా వైసిపి రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే జరిగితే జిల్లాలో సీనియర్ నాయకుడు, అనేక పర్యాయాలు మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న, ధర్మాన ప్రసాదరావుకు మంత్రిగా అవకాశం కల్పించడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రెవెన్యూ శాఖకు మంత్రిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజ్యసభకు ఎన్నిక కావడంతో, అదే పోర్ట్ ఫోలియో ధర్మాన ప్రసాదరావుకు దక్కుతుందని, మంత్రిగా జగన్ క్యాబినెట్ లో ఆయనకు బెర్త్ కన్ఫర్మ్ అని ధర్మాన అనుచరులు ఊహల పల్లకిలో ఊరేగుతున్నారట.

అటు తూర్పు గోదావరి జిల్లా నుంచి పిల్లి సుభాష్‌ చంద్రబోస్ మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహించడంతో, అదే స్థానం కోసం ఇద్దరు నేతలు పోటాపోటీ అంటున్నారు. బీసీ వర్గానికే చెందిన శెట్టిబలిజ సామాజిక తరగతి కోటాలో అయితే, రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకష్ణ, మత్స్యకార కోటాలో ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ వంటి పేర్లు వినిపిస్తున్నాయి. వీరే కాక పెడన ఎమ్మెల్యే జోగి రమేష్, గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కూడా ఆశలు పెట్టుకున్నారట. ఇలా ఖాళీ అవుతున్న రెండు మంత్రి పదవులపై, చాలామంది ఆశలు పెట్టుకున్నారు. కేబినెట్‌ వరమాల ఎవరిని వరిస్తుందో చూడాలి.

Full View


Tags:    

Similar News