Nominated Posts: ఏపీలో మరోసారి నామినేటెడ్ పదవుల కోలాహలం.. పదవుల కోసం టీడీపీ, జనసేన పోటాపోటీ
Nominated Posts: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ నామినేటెడ్ పదవులకు మరోమారు తెరతీసింది.
Nominated Posts: ఏపీలో మరోసారి నామినేటెడ్ పదవుల కోలాహలం.. పదవుల కోసం టీడీపీ, జనసేన పోటాపోటీ
Nominated Posts: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ నామినేటెడ్ పదవులకు మరోమారు తెరతీసింది. దీంతో అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల కోలాటం జోరందుకుంది. టిడిపి, జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తలు, నాయకులకు నామినేటెడ్ పదవుల పంపకాలు స్థానిక ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారింది. తెలుగుదేశం పార్టీలో పది సంవత్సరాలుగా కొనసాగుతున్న కేడర్.. తన గెలుపునకు కృషిచేసిన స్థానిక జనసైనికులు ఇరువైపులా పోటీ పడుతుండటం.. ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజుకు కత్తిమీద సాములా మారింది.
ప్రతి నామినేటెడ్ పదవికీ అటు టిడిపి.. ఇటు జనసేన నుంచి ఎక్కువ మంది ఆశావహులు పోటీ పడుతున్నారు. దీంతో టిడిపికి కేటాయిస్తే జనసేన కేడర్ అసంతృప్తి.. జనసేనకు కేటాయిస్తే స్థానిక టిడిపి కేడర్ అసంతృప్తి చెందుతుంది. ఇందులోభాగంగా ఇటీవల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి టిడిపి నాయకుడు తాడి నరసింహంకు వస్తుందని స్థానిక టిడిపి కేడర్ ఆశించినప్పటికీ.. ఆ పదవి కాస్త జనసేన పార్టీ వీర మహిళకు దక్కడంతో తెలుగు తమ్ముళ్లు అసంతృప్తికి లోనయ్యారు. మరోవైపు టిడిపి స్థానిక నాయకత్వం ఆశించినంత స్థాయిలోతమకు పదవులు ఇవ్వటం లేదని జనసేన నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ముమ్మిడివరం నియోజవర్గంలో జనసేన పార్టీ విషయానికి వస్తే.. 2024 సార్వత్రిక ఎన్నికల ముందు ముమ్మిడివరం నియోజవర్గం జనసేన పార్టీ టికెట్ ఆశించి భంగపడిన పితాని బాలకృష్ణ.. వైసీపీలో చేరారు. పితాని బాలకృష్ణ వైసిపిలో చేరినప్పటికీ నియోజకవర్గంలో జనసేన పార్టీ కేడర్ ఎక్కడా చెక్కుచెదరలేదు. అంతేకాకుండా జనసేన పార్టీ అధిష్టానం నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకుంటోంది. కూటమి పొత్తు ధర్మంలో భాగంగా కూటమి అభ్యర్థి అయిన దాట్ల సుబ్బరాజుకు మద్దతుగా నిలిచారు. ముమ్మిడివరంలో టిడిపి కేడర్‌తో పాటు జనసేన పార్టీకి మంచి ఓటు బ్యాంకు ఉంది. సొంత సామాజికవర్గం బలం కూడా కలిసొచ్చి దాట్ల సుబ్బరాజు భారీ విజయాన్ని అందుకున్నారు.
సార్వత్రిక ఎన్నికలలో జనసేన పార్టీ తక్కువ ఎమ్మెల్యే సీట్లు ఆశించినప్పటికీ.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక నామినేటెడ్ పోస్టుల విషయంలో జనసేన పార్టీకి న్యాయం చేస్తామని అధిష్టానం భరోసా ఇచ్చింది. స్థానిక నాయకత్వానికి ఎక్కువ పదువులు దక్కేలా చూస్తాననీ అప్పట్లో పవన్ కళ్యాణ్ చెప్పడంతో జనసైనికులు స్థానిక నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెంచుకున్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు కష్టపడిన జనసేన కేడర్‌కు.. పదవులు ఇవ్వడంలో నియోజకవర్గ టిడిపి అధిష్టానం చిన్న చూపు చూస్తుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ముమ్మిడివరం నియోజకవర్గంలో ముమ్మిడివరం, ఐ.పోలవరం, కాట్రేనికోన, తాళ్ళరేవు నాలుగు మండలాలు ఉన్నాయి. అందులో రెండు మండలాల్లో టిడిపి కేడర్ పూర్తి బలంగా ఉంటే.. మరో రెండు మండలాల్లో టిడిపి కేడర్‌తోపాటు జనసేన కేడర్ కూడా బలంగా ఉంది. ఈ క్రమంలో నామినేటెడ్ పదవుల విషయంలో జనసేన నాయకులు పైకి అసంతృప్తి లేదని చెప్పినప్పటికీ లోలోపల తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న భావన వారిలో వ్యక్తమవుతోంది.
అయితే నామినేటెడ్ పదవుల కేటాయింపులో ఎమ్మెల్యే దాట్ల నిర్ణయానికే వదిలేస్తున్నామని జనసేన నాయకులు చర్చించుకోవడం కూటమి ప్రభుత్వానికి కొంత ఇబ్బందికరంగా మారుతోందట. ఏళ్ల తరబడి టిడిపి జెండాను మోస్తూ.. అధికారంలో వచ్చాక కూడా సరైన న్యాయం కోసం ఎదురుచూడటంతో తప్పేం ఉందని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ఆగడాలెన్నో భరించామని టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు గుర్తు చేస్తున్నారు. ఇలా నామినేటెడ్ పదవులపై కూటమిలోని టీడీపీ, జనసేన నాయకులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. వారివారి వాదనల్లో కూడా న్యాయం లేకపోలేదన్నవాదన కూడా ఉంది. మొత్తం మీద రాజకీయాల్లో మంచి సౌమ్యుడిగా వివాదరహితుడిగా పేరుపొందిన దాట్ల సుబ్బరాజు తన నియోజకవర్గంలోని కూటమిలో వివాదాలు లేకుండా నామినేటెడ్ పదవుల భర్తీని ఏవిధంగా పూర్తి చేస్తారోనన్నది ఆసక్తికరంగా మారింది.