పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలపై 100% ప్రభుత్వ నియంత్రణ

ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల అభివృద్ధి విషయంలో వైసీపీ స్వార్థ రాజకీయాలకు పాల్పడుతూ, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం చేస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఈరోజు లోక్ సభలో మండిపడ్డారు.

Update: 2025-12-11 11:30 GMT

న్యూఢిల్లీ :ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల అభివృద్ధి విషయంలో వైసీపీ స్వార్థ రాజకీయాలకు పాల్పడుతూ, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రచారం చేస్తున్నట్లు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) ఈరోజు లోక్ సభలో మండిపడ్డారు. లోక్‌సభలో 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి విడత సప్లిమెంటరీ డిమాండ్స్‌పై జరిగిన చర్చలో ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లపాటు 17 కొత్త మెడికల్ కాలేజీలు నిర్మిస్తామని గొప్పలు చెప్పి, ఒకటైనా పూర్తిగా ప్రారంభించకుండా ప్రజలను మోసగించిందన్నారు. ఆ పార్టీ పాలనలో వైద్యరంగం అధోగతికి చేరిందని, 17 కాలేజీల్లో చాలావాటికి పునాది కూడా వేయలేదన్నారు. మొత్తం అవసరమైన రూ.8,500 కోట్లలో, కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే ఖర్చు అంటే, 12% కూడా ఖర్చు చేయలేదన్నారు. ఈ జాప్యం వల్ల రాష్ట్ర ప్రజలు, వైద్య విద్యార్థులు, డాక్టర్లు అందరూ నష్టపోయారని, తమ వైఫల్యాలను దాచేందుకు, ఇప్పుడు వైసీపీ పీపీపీ మోడల్‌ను వ్యతిరేకిస్తోందన్నారు. పీపీపీ మోడల్లో ప్రభుత్వానికి 100% నియంత్రణ ఉంటుందనీ, 50% ప్రభుత్వ కోటా సీట్లు, రిజర్వేషన్లు యథావిధిగా వుంటాయని, ప్రభుత్వం నిర్ణయించిన పరిమితిలోనే విద్యార్థుల ఫీజులు, ఆసుపత్రుల్లో 70% పడకలు ఆయుష్మాన్ భారత్ (ఆరోగ్యశ్రీ) రోగులకు వుంటాయని వివరించారు. ఈ మోడల్‌ను కేంద్ర ఆర్థిక శాఖ కూడా ఆమోదించిందనీ, జాతీయ వైద్య మండలి కూడా రాష్ట్రాలకు ఇదే సూచించిందన్నారు. అయితే, వైసీపీ అభ్యంతరం ఏమిటంటే తాము చేయలేని పనిని ఇతరులు చేసి చూపించడాన్ని తట్టుకోలేకపోవడమే అని ఎద్దేవా చేయారు.

మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన వెంటనే విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులకు వేగం, వ్యవసాయ సంక్షోభ సమయంలో కేంద్రంతో కలిసి యూరియా సరఫరా సమస్యను వెంటనే పరిష్కరించడం, వైద్య విద్యలో దీర్ఘకాలిక ప్రణాళికలు, ప్రపంచ స్థాయి సదుపాయాలు ఏర్పాటుకు ముమ్మరంగా మొదలయ్యాయని లోక్ సభలో చిన్ని అన్నారు. అనుబంధ నిధుల కోసం మొత్తం 72 గ్రాంట్ల ద్వారా కేంద్ర ప్రభుత్వం అదనంగా రూ.1.32 లక్షల కోట్లు వ్యయానికి పార్లమెంట్ అనుమతి కోరగా, ప్రతి గ్రాంటు పైన ఆయన వివరంగా మాట్లాడారు.

నిధుల వినియోగంపై ఆయన కీలక అంశాలను ప్రస్తావించారు. ఈ సప్లిమెంటరీ డిమాండ్స్‌లో, రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు రూ.31,000 కోట్ల నిధులు కేటాయించారు. యూరియా సబ్సిడీ పథకాన్ని బలోపేతం చేయడానికి ఇందులో గణనీయమైన భాగం ఖర్చు చేసేందుకు ప్రతిపాదించడం పట్ల కేశినేని చిన్ని హర్షం వ్యక్తం చేశారు. పంటల పెరుగుదలకు ఎరువులు వెన్నెముక అనీ, సరఫరాలో ఏ చిన్న ఆలస్యనైనా మొత్తం పంట నాశ‌నం జ‌రిగి రైతుల‌కు న‌ష్టం క‌లిగిస్తుంద‌న్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఆంధ్రప్రదేశ్‌లో యూరియా కొరత ఏర్పడినప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ సమస్యను కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారని, కేంద్ర మంత్రి జేపీ నడ్డా వెంటనే స్పందించి, కొత్త యూరియా స్టాక్‌లను విడుదల చేసి, రాష్ట్రవ్యాప్తంగా నిరంతర సరఫరా జరుగేలా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. సకాలంలో అందిన సహాయం ఏపీ రాష్ట్ర‌ రైతులను, పంటలను, వారి జీవనోపాధిని కాపాడిందన్నారు. రోడ్లు, రవాణా మంత్రిత్వ శాఖకు రూ.18,800 కోట్లు మళ్లింపు చేసిన నేపథ్యంలో, 2024–25 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం లక్ష్యం 10,421 కి.మీ అయినప్పటికీ, దానిని మించి 10,660 కి.మీ జాతీయ రహదారులు నిర్మించడం అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంత కట్టుబడి ఉందో చూపిస్తున్నదని ఆయన అభినందించారు.

దక్షిణ భారతంలో మెట్రో లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని గుర్తుచేస్తూ, విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్టులు ప్రాంతీయ ప్రగతికి అత్యవసరమని, ఇవి వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరేందుకు కీలకమని ఎంపీ తెలిపారు. సంక్షేమం, వ్యవసాయం, మౌలిక వసతులు, ఆరోగ్యం–విద్య రంగాల పట్ల కేంద్ర ప్రభుత్వం చూపిస్తున్న నిబద్ధతతో దేశం 8.2% జీడీపీ వృద్ధిని నమోదు చేసిందని ఎంపీ కేశినేని చిన్ని పేర్కొన్నారు. దేశాన్ని మరింత శక్తివంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర–రాష్ట్రాలు కలిసి పనిచేస్తాయని అన్నారు.

Tags:    

Similar News