Palakollu: పాలకొల్లులో కుళాయి చెరువు గట్టు అభివృద్ధి.. మంత్రికి కృతజ్ఞతలు!
Palakollu: పాలకొల్లులో రూ.5.60 కోట్లతో కొత్త కుళాయి చెరువు గట్టు అభివృద్ధి. మంత్రి నిమ్మల రామానాయుడును కలిసి కృతజ్ఞతలు తెలిపిన వాకర్స్ క్లబ్ సభ్యులు.
Palakollu: పాలకొల్లులో కుళాయి చెరువు గట్టు అభివృద్ధి.. మంత్రికి కృతజ్ఞతలు!
Palakollu: పాలకొల్లు పట్టణంలోని బ్రాడీపేట బైపాస్ రోడ్డు ప్రాంతంలో ఉన్న కొత్త కుళాయి చెరువు గట్టును పటిష్ఠం చేయడంతో పాటు పరిసర ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా సుందరీకరించేందుకు రూ.5.60 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన వాకర్స్ క్లబ్ నాయకులు, సభ్యులు పెద్ద సంఖ్యలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడును కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పలువురు మంత్రిని శాలువాలతో సత్కరించి, కూరగాయలను అందజేశారు. పాలకొల్లు లోని మంత్రి కార్యాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ.. వాకర్స్ క్లబ్ సభ్యులు అభివృద్ధి పనులకు కృతజ్ఞతలు తెలియజేయడానికి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో నడక ఎంతో ముఖ్యమని, క్రమం తప్పకుండా నడవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యల ముప్పును తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో నడక దోహదపడుతుందని తెలిపారు. వాకర్స్ క్లబ్ సభ్యులు నడక సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి, ఆ ప్రాంతాన్ని మరింత సౌకర్యవంతంగా, ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు.పాలకొల్లు పట్టణంలోని రిజర్వు స్థలాల్లో ప్రతి రెండు వార్డులకు ఒక పార్కు చొప్పున నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం రూ.14 కోట్ల నిధులు మంజూరయ్యాయని, టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయిందని చెప్పారు. త్వరలోనే పార్కుల నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు.
ప్రజల ఆదరాభిమానాలకు ప్రతిఫలంగా వారి రుణం తీర్చుకునేలా అహర్నిశలు కష్టపడి పనిచేస్తున్నానని మంత్రి పేర్కొన్నారు. ఎన్నికల్లో ప్రజలు అందించే మెజార్టీ తనపై మరింత బాధ్యతను పెంచుతుందని, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తానని నిమ్మల రామానాయుడు తెలిపారు.




