Penugonda: సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగిస్తాం: తానేటి నాగరాజు!
Penugonda: పెనుగొండలో వీఆర్ఏల సహాయ నిరాకరణ ఉద్యమం చేపట్టారు. పేస్కేల్ అమలు చేయాలని, నామినీలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ కచేరి సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు.
Penugonda: సమస్యలు పరిష్కరించే వరకు ఉద్యమం కొనసాగిస్తాం: తానేటి నాగరాజు!
పెనుగొండ: తమ దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ వీఆర్ఏ సంఘాల జేఏసీ పిలుపు మేరకు వీఆర్ఏలు బుధవారం పెనుగొండలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టారు.గాంధీ బొమ్మల రోడ్డులోని కచేరి సెంటర్ వద్ద నరసాపురం డివిజన్ వీఆర్ఏల అధ్యక్షుడు తానేటి నాగరాజు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 30 మందికి పైగా వీఆర్ఏలు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా తానేటి నాగరాజు మాట్లాడుతూ గ్రామస్థాయిలో రెవెన్యూ వ్యవస్థకు కీలకంగా పనిచేస్తూ ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.తమ సమస్యలపై పలుమార్లు విన్నవించినప్పటికీ స్పష్టమైన పరిష్కారం లభించకపోవడంతో సహాయ నిరాకరణకు దిగాల్సి వచ్చిందన్నారు.డిమాండ్లు పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
వీఆర్ఏలకు తక్షణమే పేస్కేల్ అమలు చేయాలని ఏళ్లుగా నామిని వీఆర్ఏలుగా పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.అర్హత కలిగిన వీఆర్ఏలకు వన్‌టైమ్ సెటిల్‌మెంట్ విధానంలో వీఆర్‌ఓలుగా పదోన్నతులు కల్పించాలని కోరారు. వీఆర్‌ఓ,అటెండర్,నైట్‌వాచ్‌మన్ పోస్టుల్లో వీఆర్ఏలకు ఉన్న పదోన్నతి కోటాను 20 శాతం నుంచి 70 శాతానికి పెంచాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మండల వీఆర్ఏల సంఘం ప్రతినిధులు,వివిధ గ్రామాల వీఆర్ఏలు,మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.




