Undrajavaram: ఉండ్రాజవరంలో వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ!

Undrajavaram: ఉండ్రాజవరంలో ఘనంగా వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ మంత్రులు కందుల దుర్గేష్, నిమ్మల రామానాయుడు, వంగవీటి రాధా హాజరు రాధా ఎదుగుదలకు కూటమి అండగా ఉంటుందని ప్రకటన.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE
Published on: 2 Oct 2026 4:14 PM IST
Undrajavaram
X

Undrajavaram: ఉండ్రాజవరంలో వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ!

ఉండ్రాజవరం, అక్టోబర్ 01: ఎన్ని దశాబ్దాలు గడిచినా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ప్రజా నేత వంగవీటి మోహన రంగా అని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. గురువారం ఉండ్రాజవరం మండల కేంద్రంలోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి సెంటర్ లో ప్రజానాయకుడు వంగవీటి మోహన రంగా విగ్రహావిష్కరణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది.

వందలాదిగా తరలివచ్చిన అభిమానులు, ప్రజల అభినందనలు, కోలాహలం మధ్య ఈ కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. "జై వంగవీటి", "జోహార్ వంగవీటి" నినాదాలతో ప్రాంగణమంతా మార్మోగింది.

ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్, తూర్పుగోదావరి జిల్లా ఇంచార్జి మంత్రివర్యులు, రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు, రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి యర్రా వేణుగోపాల రాయుడు, రాధా-రంగా మిత్ర మండలి అధ్యక్షులు బుల్లెట్ ధర్మారావు, రాష్ట్ర కాపు జేఏసీ నాయకులు ఆకుల రామకృష్ణ, ఆరేటి ప్రకాష్, వి.శ్రీనివాస్, శ్రీరాం, స్టేట్ హౌసింగ్ బోర్డు డైరెక్టర్ దాసరి ప్రియా సౌజన్య, కూటమి నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు కలిసి విగ్రహాన్ని అంగరంగ వైభవంగా ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు అందరూ అక్కడి ప్రజలకు, అభిమానులకు అభివాదం చేశారు. ప్రత్యేకించి మంత్రి కందుల దుర్గేష్,వంగవీటి రాధాకృష్ణ పరస్పరం ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం, ఎంతో ఆప్యాయంగా ముచ్చటించుకోవడం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విగ్రహావిష్కరణకు మునుపు మంత్రి కందుల దుర్గేష్, వంగవీటి రాధాకృష్ణ స్థానిక అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ.. నిడదవోలు నియోజకవర్గంలో గడచిన రెండేళ్ల కాలంలో మొత్తం 11 వంగవీటి మోహన రంగా విగ్రహాలను ఆవిష్కరించడం జరిగిందని తెలిపారు. యువత ముందుకు వచ్చి విగ్రహాల ఏర్పాటుకు కృషి చేస్తే తాను ఎమ్మెల్యేగా, మంత్రిగా సంపూర్ణ సహకారం అందించానని గుర్తుచేశారు. ఈ విగ్రహాలలో చాలావరకు వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ చేతుల మీదుగా ఆవిష్కరించబడటం విశేషమని పేర్కొన్నారు. గ్రామస్థాయిలో నిలువెత్తు రంగా విగ్రహాలను ప్రతిష్టించి, ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుంటున్న యువతను మంత్రి అభినందించారు.

ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ భావోద్వేగంతో మాట్లాడుతూ.. 1988లో వంగవీటి మోహన రంగా మృతి చెందినప్పుడు, అభం శుభం తెలియని పదేళ్ల ప్రాయంలోనే వంగవీటి రాధాకృష్ణ తండ్రి ప్రేమను కోల్పోయారని, అయినప్పటికీ ఎంతో సమర్థవంతంగా నిలబడ్డారని కొనియాడారు. కులమతాలకు అతీతంగా ప్రజల పక్షాన నిలబడిన రంగాపై ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ప్రజలు అదేస్థాయిలో ప్రేమను చూపుతున్నారని, అదే ఆప్యాయతను ఆయన కుమారుడు రాధాకృష్ణపై కూడా కురిపిస్తున్నారని తెలిపారు.భౌతికంగా దూరమైనా, తెలుగు ప్రజల మనసుల్లో ప్రతిక్షణం జీవించే ఉండే నాయకుడు రంగా అని కొనియాడారు.

గత వారం రోజు క్రితం వంగవీటి రాధాకృష్ణ, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలవడం ప్రతి ఒక్కరిలో ఎంతో ఆనందం కలిగించిందని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. రాధాకృష్ణ ఉన్నత స్థాయికి ఎదగడానికి కూటమి తరఫున సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

తన రాజకీయ జీవితానికి సంబంధించిన జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ.. 2007లో తాను ఎమ్మెల్సీగా పోటీ చేసిన సమయంలో, అప్పట్లో ఉన్న 10 మంది ఎమ్మెల్యేల ఓట్లలో తన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ తొలి ఓటు వేసింది వంగవీటి రాధాకృష్ణే అని, తాను ఎమ్మెల్సీ కావడానికి ఆయన కూడా ఒక ముఖ్య కారణమని కృతజ్ఞతాపూర్వకంగా గుర్తుచేసుకున్నారు. సున్నిత మనస్తత్వం, గొప్ప వ్యక్తిత్వం, వివాద రహిత ధోరణి, అద్భుతమైన విషయ పరిజ్ఞానం కలబోసిన వంగవీటి రాధాకృష్ణ భవిష్యత్తులో మరింత గొప్ప నాయకుడిగా ఎదుగుతారని ధీమా వ్యక్తం చేశారు. రాధాకృష్ణకు ప్రజలందరి మద్దతు ఎప్పుడూ ఉండాలని ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు.

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE

UJJINA BALARAMA KRISHNA, NIDADAVOLE