Peravali: పాత ఆల్టో కారుపై వినాయకుడి వినూత్న ఊరేగింపు
Peravali: అన్నవరప్పాడులో వినాయక చవితి వేడుకల్లో భాగంగా పాత ఆల్టో కారును ప్రత్యేకంగా అలంకరించి విగ్రహాన్ని ప్రతిష్ఠించి వినూత్నంగా ఊరేగించారు.
Peravali: పాత ఆల్టో కారుపై వినాయకుడి వినూత్న ఊరేగింపు
పెరవలి: వినాయక చవితి మహోత్సవాల్లో భాగంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా వినాయకుడి ఊరేగింపులు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సాధారణంగా పూల అలంకరణలు, వివిధ రకాల డెకరేషన్లతో ప్రత్యేకంగా రూపొందించిన వాహనాలపై వినాయకుడిని ఊరేగించడం మనం చూస్తుంటాం.
అయితే తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామంలో మాత్రం చెరువు గొట్టు చిన్న వినాయకుడి ఊరేగింపు అందరి దృష్టిని ఆకర్షించింది. 90వ దశకానికి చెందిన ఆల్టో 800 కారును ప్రత్యేకంగా అలంకరించి.. ఆ కారుపై వినాయకుడిని ప్రతిష్ఠించి ఊరేగించారు.
సాధారణంగా కనిపించే కారును వినాయకుడి ఊరేగింపు వాహనంగా తీర్చిదిద్దిన తీరు గ్రామస్తులను, యువతను విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం వినూత్నంగా ఆలోచిస్తూ ప్రత్యేకమైన అలంకరణలతో వినాయకుడి ఊరేగింపులు నిర్వహిస్తున్న సమయంలో.. పాతకాలం నాటి కారును సరికొత్తగా డెకరేట్ చేసి వినాయకుడిని ఊరేగించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
అలంకరణతో ముస్తాబైన ఆల్టో కారు.. దానిపై కొలువుదీరిన వినాయకుడు.. ఊరేగింపుగా ముందుకు సాగుతుండటంతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. *పాత కారుకు కొత్త రూపం.. వినాయకుడి ఊరేగింపుకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.*
వినూత్నంగా ఆలోచిస్తే.. ఉన్న వనరులతోనే ప్రత్యేకతను చాటవచ్చని నిరూపిస్తూ అన్నవరప్పాడు గ్రామంలో నిర్వహించిన ఈ వినాయకుడి ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది.




