Undrajavaram: ఉండ్రాజవరంలో రంగా విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలి
Undrajavaram: ఉండ్రాజవరంలో రంగా విగ్రహ తొలగింపుపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు సీరియస్. తొలగించిన ప్రదేశంలోనే విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్.
Undrajavaram: ఉండ్రాజవరంలో రంగా విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలి
ఉండ్రాజవరం: ఉండ్రాజవరం గాంధీ సెంటర్‌లో వంగవీటి మోహన్ రంగా విగ్రహం ఏర్పాటు, తొలగింపు విషయంలో తలెత్తిన వివాదంపై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కీలక వ్యాఖ్యలు చేశారు. రంగా అభిమానులు, కాపు సామాజిక వర్గ నాయకుల మనోభావాలను దెబ్బతీయకుండా తొలగించిన ప్రదేశంలోనే రంగా విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
పైడిపర్రు ఆకుల శ్రీరాములు కళ్యాణ మండపంలో కాపు రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉండ్రాజవరం గాంధీ సెంటర్‌లో వంగవీటి మోహన్ రంగా విగ్రహం ఏర్పాటు వివాదంపై ఆయన స్పందించారు.
ఏడాది క్రితమే సలహాలు ఇచ్చినా అడ్డంకులు
విగ్రహం ఏర్పాటు విషయంలో ఏడాది క్రితమే సంబంధిత వ్యక్తులకు పలు సలహాలు ఇచ్చామని, అయినప్పటికీ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని తోట త్రిమూర్తులు అన్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు వివిధ రాజకీయ పార్టీల్లో నాయకులుగా ఉండవచ్చని, అయితే ఈ అంశానికి రాజకీయ రంగు పులమకుండా కాపు సామాజిక వర్గం అంతా ఒకే తాటిపైకి వచ్చి సమస్య పరిష్కారమయ్యే వరకు బలంగా నిలబడాలని కోరారు.
రంగా మాకు ఆరాధ్యదైవం
కొందరు వ్యక్తులు ముఖాలకు నల్లని దుస్తులు ధరించి రంగా విగ్రహాన్ని తొలగించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనిపించాయని తోట త్రిమూర్తులు పేర్కొన్నారు. సెంటర్‌లో రంగా విగ్రహం ఏర్పాటు చేస్తే ఉదయం లేవగానే ఒక రౌడీ ముఖం చూడాలా అంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారని అన్నారు. “మీకు ఆయన రౌడీ కావచ్చు.. మాకు మాత్రం ఆరాధ్యదైవం” అని వ్యాఖ్యానించారు.
ఎన్నికల సమయంలో రంగా నామస్మరణ చేయకుండా ఏ ఒక్క నాయకుడు కూడా ఓట్లు అభ్యర్థించలేరని తోట త్రిమూర్తులు అన్నారు. రంగా అభిమానుల మనోభావాలను గౌరవించాలని సూచించారు. అనుమతులు లేకుంటే ప్రత్యామ్నాయ స్థలంలో ఏర్పాటు చేయాలి
తొలగించిన ప్రదేశంలోనే రంగా విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయడానికి అధికారులు అనుమతులు మంజూరు చేయాలని తోట త్రిమూర్తులు కోరారు. ఒకవేళ అక్కడ అనుమతులు ఇవ్వని పరిస్థితి ఉంటే రంగా అభిమాని కోటిపల్లి తాతారావు ఇచ్చిన స్థలంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
పోలీసుల తీరుపై విమర్శలు
రంగా విగ్రహం తొలగింపు వివాదంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారని తోట త్రిమూర్తులు విమర్శించారు. డీఎస్పీ దేవకుమార్ గురించి తనకు తెలుసని, తన గురించి ఆయనకు కూడా తెలుసని వ్యాఖ్యానించారు. అధికార పదవులు శాశ్వతం కాదని అన్నారు.
సీఐ తిలక్, ఉండ్రాజవరం ఎస్సై రవికుమార్ తమ సామాజిక వర్గానికి చెందిన నాయకులు, రంగా అభిమానులపై విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేసి భయభ్రాంతులకు గురిచేశారని ఆరోపించారు. అధికారం శాశ్వతం కాదని, పోలీసులు భవిష్యత్తులో కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి తెచ్చుకోవద్దని హెచ్చరించారు.
రంగా విగ్రహ ఏర్పాటుకు అడుగడుగునా అడ్డంకులు: కటకం రామకృష్ణ
ఈ సమావేశంలో కటకం రామకృష్ణ మాట్లాడుతూ.. ఉండ్రాజవరంలో రంగా విగ్రహం ఏర్పాటు కోసం ప్రారంభం నుంచే గ్రామంలో అనేక అడ్డంకులు సృష్టిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విగ్రహం ఏర్పాటు వివాదం గురించి తెలుసుకున్న రంగా కుమార్తె ఆశా కిరణ్ ఉండ్రాజవరం గ్రామానికి చేరుకుని రంగా అభిమానులతో మాట్లాడారని తెలిపారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతున్న సమయంలో డీఎస్పీ తలుపులకు తాళం వేసి, రంగా అభిమానులపై లాఠీచార్జ్ చేయించారని ఆరోపించారు.
కొంతమంది కార్యకర్తల చొక్కాలు పట్టుకుని ఈడ్చుకుంటూ నిడదవోలు పోలీస్ స్టేషన్‌కు తరలించారని కటకం రామకృష్ణ ఆరోపించారు. ఈ ఘటనపై అధికారులు స్పందించి, రంగా విగ్రహం ఏర్పాటు వివాదాన్ని సామరస్యపూర్వకంగా పరిష్కరించాలని కోరారు.
విగ్రహం ఏర్పాటు విషయంలో తలెత్తిన వివాదానికి ముగింపు పలికి, రంగా అభిమానులు, స్థానిక ప్రజల మధ్య ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకోకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని సమావేశంలో నాయకులు కోరారు.




