Tanuku: మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థులు పోటీకి సిద్ధం కావాలి!

Tanuku: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీకి సిద్ధం కావాలి: తణుకు పట్టణ సమితి సమావేశంలో సీపీఐ రాష్ట్ర నేత పెన్మెత్స దుర్గాభవాని పిలుపు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 21 Sept 2026 5:10 PM IST
Tanuku
X

Tanuku: మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థులు పోటీకి సిద్ధం కావాలి!

తణుకు: జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థులు పెద్ద ఎత్తున పోటీకి సమాయత్తం కావాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు కామ్రేడ్ పెన్మెత్స దుర్గాభవాని పిలుపునిచ్చారు. సోమవారం తణుకులోని వంక సత్యనారాయణ సురాజ్య భవన్‌లో జరిగిన సీపీఐ తణుకు పట్టణ సమితి సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా సీపీఐ నిరంతరం ప్రజా ఉద్యమాలను నిర్వహిస్తోందని ఆమె అన్నారు. ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, ప్రజలకు కనీస అవసరాలు కల్పించేందుకు సీపీఐ నిరంతరం పోరాడుతోందన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై పోరాడే సీపీఐ అభ్యర్థులను ప్రజలు ఆదరించాలని కోరారు.

పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని, పేదల సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు చేయాలని, అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణానికి అవసరమైన సహాయం అందించాలని సీపీఐ నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తోందన్నారు. సీపీఐ నిర్వహిస్తున్న ప్రజా పోరాటాల ఫలితంగానే పలు సమస్యలపై ప్రభుత్వాలు స్పందించి అమలుకు పూనుకుంటున్నాయని తెలిపారు.

సీపీఐ పశ్చిమ గోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు మాట్లాడుతూ, నీతి, నిజాయితీకి కట్టుబడి, ఎలాంటి పదవీకాంక్ష లేకుండా ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పనిచేస్తున్న పార్టీ సీపీఐ అని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యలను ప్రధాన ఎజెండాగా తీసుకుని సీపీఐ అభ్యర్థులు ప్రజల్లోకి వెళ్లాలని ఆయన పిలుపునిచ్చారు.

సీపీఐ తణుకు పట్టణ సమితి సభ్యుడు మందుల ముత్తయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీపీఐ తణుకు పట్టణ కార్యదర్శి బొద్దాని నాగరాజు, సీపీఐ తణుకు ఏరియా కార్యదర్శి సికిలే పుష్పకుమారి, పట్టణ సమితి సభ్యులు గార ప్రసాద్, గుబ్బల వెంకటేశ్వరరావు, బండి సత్యనారాయణ, పుట్టా అమ్మిరాజు,పెండ్యాల దత్తాత్రేయ ప్రసాద్,కట్టుంగ శంకర్, అత్తిలి శ్రీను, బొద్దాని మురళీ, మందుల లక్ష్మి, జి. అన్నపూర్ణ, నమ్మి రాజు, కొంబత్తుల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)