Tanuku: తణుకు మున్సిపల్ చైర్మన్ పీఠంపై హోరాహోరీ పోరు!
Tanuku: పుష్కర కాలం అనంతరం తణుకు మున్సిపాలిటీలో ఎన్నికల నగారా మోగింది. చైర్మన్ పీఠం కోసం కూటమి తరఫున బసవ రామకృష్ణ, వైసీపీ తరఫున బలరాం మధ్య హోరాహోరీ పోరు నెలకొంది.
Tanuku: తణుకు మున్సిపల్ చైర్మన్ పీఠంపై హోరాహోరీ పోరు!
తణుకు: పుష్కర కాలం అనంతరం తణుకు మున్సిపాలిటీలో ఎన్నికల నగారా మోగింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పట్టణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. మున్సిపల్ చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార కూటమి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. ఇప్పటికే వైసీపీ తరఫున యిండుగపల్లి బలరామ కృష్ణ (బలరాం)ను చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించగా, తెలుగుదేశం పార్టీ తరఫున బసవ రామకృష్ణ బరిలో నిలిచారు.
ముందుగా వైసీపీ తమ చైర్మన్ అభ్యర్థిగా బలరాం పేరును ప్రకటించి ఎన్నికల ప్రచారానికి సిద్ధమైంది. మరోవైపు కూటమి తరఫున అభ్యర్థి ఎంపికపై మూడు రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు ఆదివారం రాత్రి తెరపడింది. టీడీపీ సీనియర్ నాయకుడు బసవ రామకృష్ణను చైర్మన్ అభ్యర్థిగా ఖరారు చేయడంతో రాజకీయ సమీకరణాలు ఆసక్తికరంగా మారాయి.
ఈ ఎన్నికల్లో ప్రజా సమస్యలే ప్రధాన అజెండాగా ముందుకు వెళ్తామని వైసీపీ అభ్యర్థి బలరాం చెబుతున్నారు. గత ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయలేదనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి, తమకు మద్దతు ఇవ్వాలని కోరనున్నట్లు తెలుస్తోంది. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఎన్నికల బరిలో నిలిచామని, విజయం తమదేనని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే తమకు విజయాన్ని అందిస్తాయని టీడీపీ అభ్యర్థి బసవ రామకృష్ణ దీమా వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో చేపట్టిన అభివృద్ధి పనులు, భవిష్యత్తులో అమలు చేయనున్న ప్రణాళికలను ప్రజలకు వివరిస్తూ ఓటర్ల మద్దతు కూడగట్టేందుకు కూటమి నాయకులు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు.




