Tanuku: అత్తిలి మండలంలో కూటమి అభ్యర్థుల విజయం కోరిన ఎమ్మెల్యే ఆరిమిల్లి!

Tanuku: అత్తిలి మండలంలో కూటమి అభ్యర్థుల విజయం కోరిన తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ. గత వైసీపీ పాలన, మాజీ మంత్రి కారుమూరిపై తీవ్ర విమర్శలు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 31 Oct 2026 6:13 PM IST
Tanuku
X

Tanuku: అత్తిలి మండలంలో కూటమి అభ్యర్థుల విజయం కోరిన ఎమ్మెల్యే ఆరిమిల్లి!

తణుకు: స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపిస్తే గ్రామాల అభివృద్ధిని మరింత వేగవంతం చేయవచ్చని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అత్తిలి మండలంలో శనివారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో అన్ని రంగాలు విధ్వంసానికి గురయ్యాయని, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో రైతులు ధాన్యం విక్రయించినప్పటికీ సకాలంలో సొమ్ములు అందక ఇబ్బందులు పడ్డారని ఆరోపించారు. కనీసం రైతులకు గోనె సంచులు కూడా అందించలేని దుస్థితి అప్పట్లో నెలకొందన్నారు.

ధాన్యం డబ్బులు రావడం లేదని ప్రశ్నించిన రైతులను అవమానించడంతో పాటు, వారి సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించి అప్పటి మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు రైతుల ఉసురు పోసుకుని జైలు ఊచలులెక్కపెడుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేగా తాను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అత్తిలి మండలంలోని జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. జడ్పీటీసీ అభ్యర్థిగా శిరగాని నాగేశ్వరరావు (నాగు) సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారని తెలిపారు. మండలంలోని ఎంపీటీసీ స్థానాల్లో ఆరుగురు అభ్యర్థులు జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై, ఒకరు బీజేపీ కమలం గుర్తుపై, మరో 13 మంది తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై పోటీ చేస్తున్నారని వివరించారు.

ఓటర్లు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో రెండు ఓట్లు వేయాల్సి ఉంటుందని, జడ్పీటీసీ అభ్యర్థికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి, ఎంపీటీసీ అభ్యర్థికి ఆయా స్థానాల్లో పోటీ చేస్తున్న సైకిల్, గాజు గ్లాసు, కమలం గుర్తుల్లో తమ కూటమి అభ్యర్థిని గుర్తించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా పరిషత్ స్థాయి వరకు కూటమి ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు మరిన్ని అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అందించవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రచార కార్యక్రమాల్లో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)