Tanuku: అత్తిలి మండలంలో రూ.2.24 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం

Tanuku: తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అత్తిలి మండలంలో రూ.2.24 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించారు. పుంత రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తున్నామన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)
Published on: 9 Oct 2026 6:39 PM IST
Tanuku
X

Tanuku: అత్తిలి మండలంలో రూ.2.24 కోట్ల అభివృద్ధి పనుల ప్రారంభం

తణుకు: గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అన్నారు.అత్తిలి మండలంలో బల్లిపాడు, ఉరదాళ్లపాలెం, అత్తిలి తదితర గ్రామాల్లో రూ. 2.24 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపనలు చేసి, పూర్తయిన పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

పుంత రోడ్లకు మహర్దశ..

రైతులకు వ్యవసాయ పనుల్లో రవాణా సౌకర్యం మెరుగుపడేలా పుంత రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని పుంత రోడ్ల నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు కేటాయిస్తున్నామని చెప్పారు.గుమ్మంపాడు గ్రామంలో పుంత రోడ్ల అభివృద్ధికి రూ. 30 లక్షలకు పైగా నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. రాబోయే కాలంలో నియోజకవర్గంలో పుంత రోడ్లను దశలవారీగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

డెల్టా ప్రాంతంలో భౌగోళిక పరిస్థితుల కారణంగా డ్రైనేజీ నిర్మాణంలో స్థానిక అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ఎమ్మెల్యే వివరించారు. ప్రభుత్వం ప్రతిపాదించిన మ్యాజిక్ డ్రైన్ల విధానం తమ ప్రాంతానికి పూర్తిస్థాయిలో అనుకూలంగా ఉండకపోవచ్చని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ నాయకత్వంలో జిల్లా మంత్రులు, ఇతర నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి ఓపెన్ డ్రైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించినట్లు తెలిపారు. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుని, గ్రామాల్లో డ్రైనేజీ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం చేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.

2027 నాటికి ప్రతి ఇంటికీ గోదావరి జలాలు

జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించే పనులను వేగవంతం చేశామని ఆరిమిల్లి రాధాకృష్ణ తెలిపారు. 2027 నాటికి గోదావరి జలాలను ప్రతి ఇంటికీ తాగునీటి కుళాయిల ద్వారా అందించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ సమగ్ర అభివృద్ధిని సాధించేందుకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు.

Kallem Murali, Tanuku (West godavari dist)

Kallem Murali, Tanuku (West godavari dist)