Yernagudem: ప్రముఖ రాజకీయ నాయకులు బొల్లిన రామకృష్ణారావు కన్నుమూత!
Yernagudem: యర్నగూడెం మాజీ సర్పంచ్, ప్రముఖ సమాజ సేవా తత్పరులు బొల్లిన రామకృష్ణారావు (రాములు) గుండెపోటుతో మృతి. సంతాపం తెలిపిన నాయకులు, ప్రజలు.
Yernagudem: ప్రముఖ రాజకీయ నాయకులు బొల్లిన రామకృష్ణారావు కన్నుమూత!
Yernagudem: మండలం యర్నగూడెం గ్రామానికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, సమాజ సేవా తత్పరులు బొల్లిన రామకృష్ణారావు (రాములు) (84) సోమవారం ఉదయం గుండెపోటుతో స్వగృహంలో కన్నుమూశారు. ఆయన మృతి పట్ల గ్రామ ప్రజలు, అభిమానులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
శ్రీమంతులైన బొల్లిన వెంకట సుబ్బారావు, వెంకటరత్నం దంపతులకు నాలుగో సంతానంగా రామకృష్ణారావు జన్మించారు. కుటుంబ వారసత్వంగా వచ్చిన రాజకీయ రంగంలో యువదశ నుంచే చురుగ్గా పాల్గొంటూ ప్రజా సేవకు అంకితమయ్యారు. రెండు దశాబ్దాలకు పైగా యర్నగూడెం గ్రామ సర్పంచ్‌గా బాధ్యతలు నిర్వహించి గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారు. సొసైటీ అధ్యక్షుడిగా, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా తదితర పలు పదవుల్లో సేవలందించారు.
గ్రామాభివృద్ధితో పాటు విద్య, సామాజిక సేవలకు రామకృష్ణారావు కుటుంబం విశేష ప్రాధాన్యత ఇచ్చింది. గ్రామంలో విద్యా అభివృద్ధికి తన కుటుంబ సభ్యుల ద్వారా భూములను దానం చేశారు. ఆయన తండ్రి బొల్లిన సుబ్బారావు ఎలిమెంటరీ పాఠశాల నిర్మాణానికి ఒక ఎకరం భూమిని, పినతండ్రి, మాజీ సర్పంచ్ బొల్లిన గంగరాజు ఉన్నత పాఠశాల నిర్మాణానికి ఎనిమిది ఎకరాల భూమిని దానం చేశారు. ఈ సేవలతో గ్రామంలో విద్యాభివృద్ధికి బలమైన పునాది ఏర్పడింది.
రామకృష్ణారావు సర్పంచ్‌గా ఉన్న కాలంలో యర్నగూడెం గ్రామం వరుసగా పది సంవత్సరాల పాటు ఉత్తమ గ్రామ పంచాయతీగా పురస్కారాలు అందుకుని అభివృద్ధి పథంలో ముందుకు సాగింది. సౌమ్య స్వభావం, పేదల పట్ల ఆదరణ, దానశీలత, ప్రజా సేవా దృక్పథంతో ఆయన గ్రామ ప్రజల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు.
రామకృష్ణారావు పార్థివదేహాన్ని సొసైటీ చైర్మన్ పెన్మెత్స సుబ్బరాజు, గ్రామ టీడీపీ అధ్యక్షులు బొల్లిన విజయభాస్కర్, పత్తిపాటి హరినాథ్ తదితర నాయకులు సందర్శించి ఘన నివాళులు అర్పించారు. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు ఆయనకు నివాళులు అర్పించారు. మరణవార్త తెలిసిన వెంటనే అభిమానులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన మృతి సమాజానికి తీరని లోటని పలువురు పేర్కొన్నారు.




