Iragavaram: వీఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: ఈద రామారావు
Iragavaram: ఇరగవరంలో గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏల) సహాయ నిరాకరణ సమ్మె 23వ రోజుకు చేరింది. తగిన పేస్కేలు అమలు చేయాలని నాయకులు డిమాండ్ చేశారు.
Iragavaram: వీఆర్ఏల సమస్యలు వెంటనే పరిష్కరించాలి: ఈద రామారావు
Iragavaram: వీఆర్ఏల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని వీఆర్ఏల సంఘ గౌరవ అధ్యక్షుడు ఈద రామారావు డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ రాష్ట్ర వీఆర్ఏ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఇరగవరం మండల కేంద్రంలో చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమం శనివారం నాటికి 23 రోజుకు చేరింది.
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా గ్రామ రెవెన్యూ సహాయకులకు (వీఆర్ఏలకు) తగిన వేతన స్కేలు అమలు చేయాలని కోరారు.
చాలీచాలని వేతనాలతో వీఆర్ఏలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలను మెరుగైన విద్యను అందించే పాఠశాలల్లో చదివించుకునే స్థోమత కూడా లేకుండా పోయిందని అన్నారు.
ఎన్నికల సమయంలో ప్రజా ప్రతినిధులు ఇచ్చిన హామీల మేరకు ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు స్పందించి వీఆర్ఏల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఆయన కోరారు. సంఘ ఉపాధ్యక్షురాలు బొజ్జా ప్రసన్న కుమారి మాట్లాడుతూ 23 రోజులుగా వీఆర్ఏలు సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందని ఆరోపించారు.
అర్హత కలిగిన వీఆర్ఏలకు పదోన్నతులు కల్పించి, నామినీలుగా పనిచేస్తున్న వారిని క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏల సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి వెంటనే చర్చలు జరిపి పరిష్కారం చూపాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు కట్టుంగ కోటేశ్వరరావు, కార్యదర్శి ఎం. పాపారావు, కోశాధికారి ఖండవల్లి ఆశీర్వాదం, డివిజన్ కార్యదర్శి సబ్బితి వెంకటేశ్వరరావు, యార్లగడ్డ వెంకట్రావు, మల్లిపూడి జయరాజు తదితర వీఆర్ఏలు పాల్గొన్నారు.




